Sanju Samson creates history became Most sixes by an Indian in single edition of T20 World Cup
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతులను ఎదుర్కొన్న అతడు 89 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో సంజూ శాంసన్ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ను అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో రోహిత్ శర్మ 15 సిక్సర్లు కొట్టగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదిన శాంసన్ టీ20 ప్రపంచకప్ 2026లో తన సిక్సర్ల సంఖ్యను 16కు పెంచుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో శాంసన్ సిక్సర్ల సంఖ్య 20 కి చేరుకునే అవకాశం ఉంది.
* సంజూ శాంసన్ – 16* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
* రోహిత్ శర్మ – 15 సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2024)
* శివమ్ దూబె – 15* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
* ఇషాన్ కిషన్ – 14* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
* హార్దిక్ పాండ్యా – 14* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ (89; 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్థశతకం బాదగా.. శివమ్ దూబె (43), ఇషాన్ కిషన్ (39) లు రాణించారు. ఇంగ్లీష్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు సాధించగా.. జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ తీశాడు.
ఆ తరువాత 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జాకబ్ బెథెల్ (105; 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసినా మిగిలిన వారు విఫలం కావడంతో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. టీమ్ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ తీశారు.