సస్పెన్స్ వీడింది..! రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రాయ్ బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్న ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించింది.

Amethi-Raebareli Congress Candidate : కాంగ్రెస్ పార్టీలో రాయ్ బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేది ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. కొద్దిరోజులుగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరు బరిలో నిలుస్తారన్న ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించింది. రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీ నియోజకవర్గం నుంచి కిషోరి లాల్ శర్మ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రెండు నియోజకవర్గాలకు ఏఐసీసీ రాహుల్, లాల్ శర్మల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలకు ఇవాళ చివరి గడువు. దీంతో రాహుల్ గాంధీ, కేఎల్ శర్మలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Also Read : Cm Revanth Reddy : హరీశ్ రావు.. నీ రాజీనామా సిద్ధం చేసుకో- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలని చెప్పొచ్చు. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో సోనియా గాంధీ చేతిలో ప్రతాప్ సింగ్ ఓడిపోయారు. యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దినేష్ ప్రతాప్ సింగ్ ను రాయ్ బరేలీ నుంచి బీజేపీ మరోసారి బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో సోనియాపై ఇప్పటి వరకు పోటీచేసిన అభ్యర్థులందరిలో దినేశ్ ప్రతాప్ సింగ్ కే అత్యధిక ఓట్లు వచ్చాయి. దీంతో మరోసారి ఆయన పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉంటే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ పోలింగ్ సైతం పూర్తయింది. తాజాగా రాయ్ బరేలీ నుంచి కూడా రాహుల్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో (2019) రాహుల్ గాంధీ వాయనాడ్, అమేథీ నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. వాయనాడ్ లో విజయం సాధించగా.. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.

Also Read : Jithender Reddy Trailer : ఎన్నికల ముందు సంచలన బయోపిక్.. ‘జితేందర్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా..

అమేథీ నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరి లాల్ శర్మ పోటీచేయబోతున్నారు. అమేథీ గాంధీ కుటుంబానికి మంచి పట్టున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇదిలాఉంటే.. సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఆమె పోటీకి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

 

ట్రెండింగ్ వార్తలు