Cm Revanth Reddy : హరీశ్ రావు.. నీ రాజీనామా సిద్ధం చేసుకో- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Cm Revanth Reddy : హరీశ్ రావు.. నీ రాజీనామా సిద్ధం చేసుకో- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Cm Revanth Reddy : రాజీనామాను సిద్ధం చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావుని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆగష్టు 15 నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న సీఎం రేవంత్.. అదే రోజు ఈ శనీశ్వర రావు పీడ వదులుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలిలో కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ నుంచి ఒక బలహీన వర్గాల అభ్యర్థిని నిలిపాం. ఆరు నూరైనా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా మెదక్ లో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగరాలి. 45 ఏళ్లుగా ఇక్కడ మామ, అల్లుడు శని లాగా, పాపాల బైరవుల్లా పీక్కుతింటున్నారు. బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగించడానికి ఇక్కడికి వచ్చా. 1980లో ఇందిరా గాంధీని ఇక్కడి నుంచి ప్రధానిని చేసిన చరిత్ర ఇక్కడి ప్రజలకు ఉంది. పఠాన్ చెరు పారిశ్రామిక వాడ మెదక్ జిల్లాలో ఉంది. ఇక్కడ కౌన్సిలర్ గా, సర్పంచ్ లుగా, ఎమ్మెల్యేలుగా నిలబడాలంటే పోలీసులు వచ్చి బెదిరిస్తారు. అక్రమ కేసులు పెడతారు.

మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దొరల గడీలను బద్దలు కొట్టాల్సిందే. ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరకుంటే శాశ్వతంగా బానిసలుగా మిగిలిపోతారు. ఎవడు వెంకట్రామిరెడ్డి.. వందల ఎకరాలు గుంజుకున్నోడు, పోలీసులతో కొట్టించినోడు. మామ, అల్లుళ్ళు ఏం చూసి టిక్కెట్ ఇచ్చారు.. డబ్బులేనా? కూతవేటు దూరంలో వందల ఎకరాలు దోచుకుని దాచుకున్న దొంగ వెంకట్రామిరెడ్డి. నిజాం వద్ద కాశిం రిజ్వి ఎట్లనో.. మామ, అల్లుళ్ళ వద్ద వెంకట్రామిరెడ్డి అట్ల.

సిద్దిపేటకు పట్టిన చీడ, పీడ.. మామ అల్లుళ్ళు.. మామ అణిముత్యం, అల్లుడు స్వాతి ముత్యం అని చెప్పుకుంటారు. మిమ్మల్ని బుట్ల కింద వేసి తొక్కినా ఓట్లు వేసి గెలిపించారని అనరా? ఈ భూములు మింగే అనకొండకు బుద్ధి చెప్పాలి. మొట్టమొదటిసారి గడీలు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ఎన్నో కష్టాలు, అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట బిడ్డల పౌరుషాన్ని చూసి నాకు సంపూర్ణ నమ్మకం కలిగింది.

మెదక్ లో నీలం మధు లక్ష మెజరిటీతో గెలుస్తాడు. సిద్దిపేటలో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుంది. ఇక్కడికి వచ్చిన ఒక్కో కార్యకర్త వంద మందితో సమానం. సోనియా ఇచ్చిన అభివృద్ధి పనులు మోడీ కాలగర్భంలో కలిపి గాడిద గుడ్డు ఇచ్చారు. వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు అన్నట్టు కేసీఆర్, హరీశ్ రావు ,కేటీఆర్, రఘునందన్ రావు వీరేనా? పేర్లు, రంగులు మాత్రమే వేరు. రుచి మాత్రం ఒక్కటే. బీజేపీ, బీఆర్ఎస్ పొద్దటి పూట వేరు పార్టీ, రాత్రి పూట ఒక పార్టీ.

నీలం మధును గెలిపించండి. ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. కాంగ్రెస్ చేసిన సామాజిక న్యాయం ఇతర పార్టీల్లో ఉందా? అద్దంకి దయాకర్, రేవంత్ రెడ్డి వేరు వేరు కాదు మేమిద్దరం ఒక్కటే. నేను 15 ఆగష్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నా. హరీశ్ రావు రాసి పెట్టుకో. కొమురెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్నా.. 2 లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేటకు నీ పీడ వదిలిస్తా. రాజీనామా సిద్ధం చేసుకో. 15 ఆగష్టు నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అదే రోజు ఈ శనీశ్వర రావు పీడ వదులుతుంది.

నేను మళ్ళీ సిద్దిపేటకు వస్తా, కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. 15 ఆగష్టు నాడు లక్ష మందితో ఇక్కడే బహిరంగ సభ పెడతా.. నీ సంగతి తెలుస్తా.. ఐదు హామీలు అమలు చేశాం. 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇన్ని చేస్తే పెద్దాయన మోడీ.. పిలగాడు బాగానే చేస్తున్నాడు అని అంటాడనుకున్నా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాడనుకున్నా. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగాం.. మోడీ ఏమిచ్చిండు.. గాడిద గుడ్డు” అని విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : నేను చెప్పింది తప్పు అయితే జైలుకి వెళ్లేందుకు సిద్ధం- కేటీఆర్ సంచలనం