Groundnut Varieties : ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు.. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి!

ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి.

Groundnut Varieties : నూనెగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తూ ఉంటారు రైతులు.  ప్రాంతాన్నిబట్టి, ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశనగను జూన్ నుండి ఆగష్టు వరకు సాగుచేస్తారు. ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశనగను విత్తుతారు.

పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి. వీటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెళకువల గురించి శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస  కృషి విజ్ఞాన కేంద్రం  ప్రోగ్రాం కో ఆర్డినేటర్,  డా. డి. చిన్నమనాయుడు రైతాంగానికి తెలియజేస్తున్నారు, చూడండి.

Read Also : Ginger Cultivation : ఖరీఫ్‌కు అనువైన అల్లం రకాలు.. అధిక దిగుబడికోసం మేలైన యాజమాన్యం  

ఖరీఫ్‌లో వర్షాధారంగా  వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా  ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు.  ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఉత్తరకోస్తా జిల్లాల్లో సాగులోవున్న ప్రధాన నూనెగింజల పంట వేరు శనగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు.

దీనికితోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపధ్యంలో ఖరీఫ్ వేరుశనగలో  అధిక దిగుబడిని పొందాలంటే, రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు, ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం జిల్లా , ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం , ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. డి. చిన్నమనాయుడు.

కదిరి నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మరి కోన్ని వేరుశనగ రకాలు శ్రీకాకుళం జిల్లాకు అనువుగా ఉన్నాయి.  ఇవి తక్కువ ఎత్తులో పెరిగి, తక్కువ  పంట కాలం ఉండి మంచి దిగుబడులను  ఇస్తున్నాయి. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చాయి. విత్తనం కావాలనుకునే రైతులు దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలను సంప్రదించవచ్చు.

ముఖ్యంగా వేరుశనగ పంటలో తెగుళ్లు వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంట, వేసిన 25-30 రోజులకే మొక్కలు చనిపోతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే విత్తనం వేసేముందు  విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలి. ఖరీఫ్ వేరుశనగలో ముఖ్యమైన సమస్య కలుపు. వర్షాలు వల్ల, కలుపును సరైన సమయంలో తీయలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనికితోడు కూలీల కొరత వల్ల మొదటి 30 రోజుల్లో కలుపు తీయలేని పరిస్థితి తలెత్తుతోంది.

ఇటువంటి సమయంలో కలుపు మందుల వాడకాన్ని చక్కటి పరిష్కారంగా సూచిస్తు్నారు డా. చిన్నమ నాయుడు. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా  వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి.

ఇటు సూక్ష్మపోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ లో ఎకరాకు 8 -10 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పిన రకాలను ఎంపిక చేసుకొని, సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే ఎకరాకు 15 -20 బస్తాల దిగుబడులను సాధించే అవకాశం వుంది.

Read Also : Micro Irrigation Cultivation : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం –  ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు 

ట్రెండింగ్ వార్తలు