Micro Irrigation Cultivation : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం –  ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు 

అంతే కాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు.

Micro Irrigation Cultivation : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం –  ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు 

Micro Irrigation in Crop Cultivation

Micro Irrigation Cultivation : మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలూ మారాలి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి.  సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ.. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని.. ఆదర్శ వ్యవసాయం చేయాలి. అంతే కాకుండా వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే మైక్రో ఇరిగేషన్. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న చేయూతను ఒకసారి పరిశీలిద్దాం..

Read Also : Ginger Cultivation : ఖరీఫ్‌కు అనువైన అల్లం రకాలు.. అధిక దిగుబడికోసం మేలైన యాజమాన్యం   

సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, నీరు అనవసరానికి మించి పంటలకు  వాడుతున్నారు రైతులు. దీంతో అత్యంత విలువైన నీటిని , పోషకాలను వృధా చేయడమే కాకుండా మంచి భూములు క్రమంగా చౌడుబారుతాయి.  ఏ పైరు నుండి అయిన పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలోను నీటి ఎద్దడికి గురికాకూడదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి.

అంతే కాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో , సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మసాగు నీటి పద్ధతి ద్వారానే వీలుకలుగుతుంది. ఈ పద్ధతిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి బిందు సేద్యం కాగా మరోటి తుంపర సేద్యం.

బిందుసేద్యం  :
ప్రతిరోజు మొక్కకు కావల్సిన నీటిని లేటరల్ పైపులకు అమర్చి డ్రిప్ ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద కాని నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందుసేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీటిని ప్రెషర్ తో పైపులైన్ల ద్వారా సరఫరా చేయాలి. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగు నీరందించినప్పుడు నీటి వినియోగం  సంప్రదాయ పద్ధతిలో 30 – 40 శాతమే ఉంటుంది. తుంపర పద్ధతిలో అయితే 55 – 70 శాతం ఉంటుంది. అదే డ్రిప్ పద్ధతిలో అయితే 90 – 95 శాతం వరకు నీటి వినియోగం ఉంటుంది.

ఈ డ్రిప్ పద్ధతిలో కూడా 3 రకాలుగా ఉన్నాయి.   ఉపరితల డ్రిప్..  ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు , వరుసల మధ్య ఎక్కవ దూరం ఉన్న పంటలకు వాడుతుంటారు. నేల దిగువన అమర్చబడే డ్రిప్ ను ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్, చెరకు, సుగంధద్రవ్యాలు, ఔషదమొక్కలు, పూలమొక్కల్లో వాడుతుంటారు.   మైక్రోస్ప్రింక్లర్ పద్ధతిని ముఖ్యంగా 12 -15 సంవత్సరాల పైబడిన పండ్లతోటలకు, ఆకు కూరలు, ఆయిల్ పామ్ లాంటి పంటలకు వాడుతుంటారు.

డ్రిప్ పద్ధతి వల్ల 21 – 50 శాతం వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను అందించడం వలన మొక్కలు ఏపుగా పెరిగి, 15 – 150 శాతం అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి చెట్టుకు నీరు సమానంగా అందటం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడుస్తోంది. దీంతో 30 – 45 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. పోషక పదార్ధాలను ఫెర్టిగేషన్ ద్వారా అందిస్తే నేరుగా మొక్కల వేళ్ళకు అందుతుంది. దీంతో దాదాపు  20- 43 శాతం ఎరువులు ఆదా అవుతాయి.

స్స్రింక్లర్ సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమిపైన విరజిమ్మటం జరుగుతుంది.  ఈ విధానంలో పైపుల్లో ప్రవహింపచేసినపపుడు ఈ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపై పడుతోంది. స్ర్పింక్లర్ లను మూడు విధాలుగా అమర్చుకోవచ్చు. శాశ్వతంగా  భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చుకోవచ్చు. రెండో పద్ధతి కొంత వరకు శాశ్వతంగా అమర్చే పద్ధతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగితా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మూడో పద్ధతి తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరోక పొలానికి తీసుకొని పోయి అమర్చుకోవటానికి వీలుంటుంది.

సంప్రదాయ నీటి పారుదల విధానం మాదిరిగా కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసం లేదు. దీంతో పంట, భూమిని నష్టపోకుండా పొలం మొత్తం సాగుచేయవచ్చు. కాల్వల ద్వారా సాగు నీరు పారించినప్పుడు 35 శాతం వృధా అవుతుంది. ఈ పద్ధతిలో అలాంటి నష్టం జరగదు. అవసరమైనంతలోతుకు మాత్రమే నీటిని ఇవ్వచ్చు.  5 – 20 శాతం నాణ్యమైన అధిక దిగుబడిని తీయవచ్చు.  ఎకరా పొలంలో స్ర్పింక్లర్ లను అమర్చేందుకు రూ. 16000 – 18వేల 500 వరకు ఖర్చవుతుంది.

ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు తెలుగు రాష్ట్రాలు  మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు తొంభై శాతం రాయితీ ఇస్తున్నాయి . ఐదు నుంచి పది ఎకరాలలోపు ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నాయి. రైతులు మీ సేవా కేంద్రంలో అప్లై చేయాలి. డ్రిప్ మంజూరైన రైతు పీడీ , ఎంఐపీ పేరిట డీడీ తీసి అధికారులకు అందజేయాలి.  రాయితీ పొందని ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిచుకోవచ్చు . అంతేకాకుండా యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకోని వృదాను అరికట్టవచ్చు. ఈ పద్ధతిలో ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చు.

Read Also : Banana Farming : అరటి సాగుతో అధిక ఆదాయం పొందుతున్న రైతు