POK Unrest: PoKలో రచ్చ రచ్చ.. జెన్ జీ ఉద్యమం స్టార్ట్.. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న యువత

ఈ నెల ప్రారంభం నుంచి జెన్ జెడ్ నిరసనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అయితే, విద్యార్థులపై దుండగుడు కాల్పులు జరిపాడు. అంతే,

POK Unrest: PoKలో రచ్చ రచ్చ.. జెన్ జీ ఉద్యమం స్టార్ట్.. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న యువత

Updated On : November 8, 2025 / 5:26 PM IST

POK Unrest: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈసారి విద్యార్థులు రోడ్డెక్కారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. విద్యా విధానాలు, సంస్కరణలు, అధిక ఫీజులు వ్యతిరేకిస్తూ జెన్ జెడ్ యువత ప్రారంభించిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.

ముజఫరాబాద్‌లోని యూనివర్సిటీల్లో ఈ నిరసనలు మొదలయ్యాయి. సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతి మూడు నాలుగు నెలలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అటు ఇంటర్ విద్యార్థులు సైతం ఆందోళనల్లో పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ అసెస్‌మెంట్ సిస్టమ్ (ఈ-మార్కింగ్) పై వీరు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కొత్త విధానం కారణంగా ఫస్టియర్ రిజల్ట్స్ లో తాము ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని మండిపడుతున్నారు. మరీ దారుణం ఏంటంటే.. పరీక్షలకు హాజరుకాని కొందరు విద్యార్థులు పాస్ అయినట్లు వారు ఆరోపించారు.

ఈ నెల ప్రారంభం నుంచి జెన్ జెడ్ నిరసనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అయితే, విద్యార్థులపై దుండగుడు కాల్పులు జరిపాడు. అంతే, ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విద్యార్థులు రగిలిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. షెహజాబ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పీవోకేలో జెన్ జెడ్ చేస్తున్న ఆందోళనలు.. నేపాల్, బంగ్లాదేశ్‌ లోని విద్యార్థి ఉద్యమం తరహాలోనే ఉన్నాయి. ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్‌లలో విద్యార్థి ఉద్యమాలు ఆ దేశాలను కుదిపేశాయి. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతోనే షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. నేపాల్‌లోనూ విద్యార్థి ఉద్యమ తీవ్రతకు కేపీ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పీఓకేలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది.

గత నెలలోనూ హింసాత్మక ఆందోళనలతో పీవోకే అట్టుడికిన సంగతి తెలిసిందే. పన్నుల నుంచి ఉపశమనం, సబ్సిడీలు, అభివృద్ధి ప్రాజెక్టులు తదితర 30 డిమాండ్లపై గత నెలలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో అల్లర్లు జరిగి 12 మందికి పైగా పౌరులు చనిపోయారు. చివరికి పాక్ ప్రభుత్వం దిగివచ్చింది. ఆందోళనకారులతో చర్చలు జరిపింది. వారు చెప్పిన డిమాండ్స్ లో కొన్ని కీలకమైన వాటికి అంగీకారం తెలపడంతో అల్లర్లు సద్దుమణిగాయి. ఇప్పుడు జెన్ జెడ్ ఆందోళనలతో పాక్ ప్రభుత్వానికి చెమట్లు పడుతున్నాయి.

Also Read: ఇక యూఎస్ వీసా పొందడం అంత ఈజీ కాదు..! ట్రంప్ కొత్త రూల్.. ఈ జబ్బులు ఉంటే నో వీసా..!