Oscar 2026: చరిత్ర సృష్టించిన మైఖేల్ బి. జోర్డాన్.. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు
ఆస్కార్ 2026(Oscar 2026)లో సినర్స్ సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న మైఖేల్ బి. జోర్డాన్.
Michael B. Jordan won the Academy Award for Best Actor at the 2026 Oscars
- ఆస్కార్ 2026లో మైఖేల్ బి. జోర్డాన్ అరుదైన రికార్డ్
- సినర్స్ సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు
- ఈ అవార్డు అందుకున్న ఆరవ నల్లజాతీయుడిగా మైఖేల్ బి. జోర్డాన్
Oscar 2026: 98వ అకాడమీ అవార్డుల వేడుకలో మైఖేల్ బి. జోర్డాన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై ఆయన ‘ఉత్తమ నటుడు’గా తన కెరీర్లో తొలి బంగారు విగ్రహాన్ని అందుకున్నాడు. దర్శకుడు ర్యాన్ కూగ్లర్ రూపొందించిన ‘సినర్స్’ (Sinners) సినిమాలో ఆయన పోషించిన స్మోక్, స్టాక్ అనే రెండు భిన్నమైన పాత్రలు విమర్శకుల మనసు గెలుచుకున్నాయి.
Oscar Story: ఆస్కార్ వెనుక అసలు కథ.. ఆ బంగారు విగ్రహానికి పేరు పెట్టింది ఎవరు? ఆసక్తికరమైన నిజాలు!
ఈ విభాగంలో లియోనార్డో డికాప్రియో, తిమోతీ చాలమెట్ వంటి అగ్ర నటుల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, జోర్డాన్ అద్భుత నటన ఆయనను విజేతగా నిలబెట్టింది. అవార్డు అందుకున్న సమయంలో జోర్డాన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన చిరకాల మిత్రుడు, దర్శకుడు ర్యాన్ కూగ్లర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులకు, దేవుడికి ధన్యవాదాలు చెప్పారు. తన కంటే ముందు ఆస్కార్‌ను ముద్దాడిన సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్ వంటి దిగ్గజ నల్లజాతీయులైన నటుల స్ఫూర్తిని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.
ఈ విజయంతో ఆస్కార్(Oscar 2026) చరిత్రలో ‘ఉత్తమ నటుడు’ పురస్కారాన్ని అందుకున్న ఆరవ నల్లజాతీయుడిగా మైఖేల్ బి. జోర్డాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో బ్లాక్ పాంథర్, క్రీడ్ చిత్రాలతో మాస్ హీరోగా గుర్తింపు పొందిన ఆయన, సినర్స్ చిత్రంతో ఒక పరిపూర్ణమైన నటుడిగా ప్రపంచ ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సినిమా ప్రముఖులు, అభిమానులు ఆయన సాధించిన ఈ ఘనతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
