YS Sharmila : చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు.. వైఎస్ షర్మిల సంచలన ట్వీట్.. వైసీపీని వెనక్కినెట్టి..
YS Sharmila : చీరాల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. వైసీపీ కంటే అత్యధిక వార్డులను గెలుచుకున్నారు. ఈ ఫలితంపై వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
YS Sharmila
YS Sharmila : బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ సత్తాచాటింది. మురసు తుపాను కారణంగా ఇక్కడ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ ఫలితాల్లో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ మధ్య హోరాహోరీ పోరుసాగింది. చివరకు టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి యెరిచర్ల హనీ స్పందన 6,468 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వార్డుల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. కానీ, చీరాల మున్సిపాలిటీలో ఆ పార్టీ జోరు కొనసాగింది. మొత్తం 44వార్డుల్లో 25 స్థానాల్లో కూటమి అభ్యర్థులు (టీడీపీ 22, జనసేన 2, బీజేపీ 1) విజయం సాధించగా.. వైసీపీ అభ్యర్థులు ఎనిమిది వార్డుల్లో మాత్రమే విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ అభ్యర్థులు 10 వార్డుల్లో విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు ఉందని ఈ ఫలితాలు చాటిచెప్పాయి.
వైఎస్ షర్మిల కీలక కామెంట్స్..
చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 44 స్థానాలకు గాను 42 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపగా, 10 స్థానాల్లో విజయం సాధించారని తెలిపారు. మిగిలిన స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను రెండో స్థానంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చీరాలలో అభ్యర్థులు సాధించిన విజయాలు ఆమంచి కృష్ణమోహన్ కష్టానికి ప్రతిఫలమని షర్మిల పేర్కొన్నారు. స్థానిక ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటానికి ఈ ఫలితాలు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అణచివేయాలని చూసిన కూటమి శక్తులను ఎదుర్కొని, అధికార బలాన్ని తట్టుకుని, ప్రలోభాలకు లొంగకుండా ప్రజల పక్షాన నిలబడి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులకు షర్మిల అభినందనలు తెలిపారు. ఎన్నికల కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ కార్యకర్తలను ప్రశంసించారు. కాంగ్రెస్ అభ్యర్థులపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన చీరాల ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయినా గౌరవప్రదమైన స్థానాలను సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం దక్కిందని.. చీరాలలో కాంగ్రెస్ పార్టీదే అసలైన నైతిక విజయమని షర్మిల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనడానికి ఈ ఫలితాలు సంకేతమని పేర్కొన్నారు. ఇకపై చీరాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడాలని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులకు షర్మిల సూచించారు.
44 స్థానాల్లో భాగంగా, 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి, 10 స్థానాలను గెలిపించి, మిగతా స్థానాల్లో సైతం పార్టీని రెండో స్థానంలో నిలబెట్టడంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర PAC సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. కాంగ్రెస్ సారథ్యంలో, చీరాలలో అభ్యర్థుల గెలుపు మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. స్థానికంగా ప్రజా సమస్యలపై మీ అకుంఠిత పోరాట పటిమకు నిదర్శనం.
చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. నిజమైన ప్రజాస్వామ్య విజయం. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం అనడానికి ఇదొక సంకేతం.
ప్రజల గొంతుకను నొక్కిపట్టాలని చూసిన కూటమి శక్తులను ఎదురించి, అధికార బలాన్ని తట్టుకుని, ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా పక్షాన నిలిచి పోరాడి గెలిచిన మన వార్డు సభ్యులకు, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మి ఓటేసి గెలిపించిన చీరాల ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు 🙏.
మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేక పోయినా, గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకొని, ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న కాంగ్రెస్ దే చీరాలలో అసలైన నైతిక విజయం.
చీరాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కూటమి నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా,అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, గెలుపొందిన మన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను.
@INC_Andhra
@amanchikrishnamohan— YS Sharmila (@realyssharmila) November 6, 2026
