Tamil Nadu Politics : తమిళనాడులో ఎన్డీయే కూటమిలోకి టీవీకే..? క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..
Tamil Nadu Politics : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే కూటమిలోకి టీవీకేను చేర్చేందుకు ఆ పార్టీ అధినేత విజయ్‌తో పవన్ కల్యాణ్ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా.. ఓ తమిళ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
Pawan Kalyan on TVK Vijay joining NDA Rumors
- తమిళనాడులో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
- బీజేపీతో కలిసి టీవీకే పోటీ చేస్తుందని ప్రచారం
- విజయ్‌తో పవన్ కల్యాణ్ చర్చలు జరుపుతున్నట్లు కథనాలు
- ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Tamil Nadu Politics : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections 2026) నేపథ్యంలో బీజేపీ, టీవీకే (తమిళ వెట్రి కళగం) పార్టీల మధ్య పొత్తు విషయంపై జోరుగా చర్చ జరుగుతుంది. టీవీకే అధినేత విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు కేటాయించేలా బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే విజయ్‌తో బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారని.. మరోవైపు.. విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ అంశంపై విజయ్‌తో ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాజాగా.. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ తమిళ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్డీయే కూటమిలోకి టీవీకేను చేర్చేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని పవన్ క్లారిటీ ఇచ్చారు. నావైపు నుంచి టీవీకే విజయ్ను ఎన్డీయే కూటమిలో చేర్చే అంశం గురించి ఎలాంటి ప్రాతిపాదన లేదని, ఈ వార్త ఎలా వచ్చిందో నాకు తెలియదని పవన్ అన్నారు. “విజయ్ ఎన్డీయేలో చేరాలని నేను ఎలాంటి ప్రతిపాదన చేయలేదు, అసలు ఆయనను కలిసి దాదాపు 20 నుండి 25 ఏళ్లు అవుతోంది” అని పవన్ స్పష్టం చేశారు. విజయ్ రాజకీయ నిర్ణయాలు ఆయన వ్యక్తిగతమని, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పవన్ స్పష్టం చేశారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరితోపాటు తమిళనాడు రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
