Telangana New Pensions 2026 : తెలంగాణలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. వీరే అప్లయ్ చేయాలి.. వీరికి మళ్లీ అక్కర్లేదు!
Telangana New Pensions 2026 : తెలంగాణలో కొత్త పింఛన్లపై కీలక ప్రకటన వచ్చేసింది. ఎవరూ అప్లియ్ చేసుకోవాలి? ఎవరు అప్లయ్ చేయనవసరం లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Telangana New Pensions 2026
- కొత్త పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
- ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అర్హతలు
- నిబంధనల్లో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు
- మళ్లీ వారికి అప్లికేషన్ అవసరం లేదు
Telangana New Pensions 2026 : రాష్ట్రంలో కొత్త పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. చేయూత పింఛన్ల అర్హతపై ప్రజల్లో సందేహాలకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. సంబంధిత అధికారులు దీనిపై స్పష్టత ఇచ్చారు.
గతంలో అమల్లో ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఈసారి కూడా అర్హతలను నిర్ణయిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం నిబంధనల్లో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. అయితే, మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయనున్నారు.
మళ్లీ కొత్త అప్లికేషన్ అక్కర్లేదు :
రాష్ట్రంలో గతంలో ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో ఇప్పటికే అప్లయ్ చేసి ఉండి.. అవసరమైన సర్టిఫికేట్లను సమర్పించిన వారికి మరోసారి అప్లికేషన్ అవసరం లేదని తెలంగాణ సర్కార్ తెలిపింది. ఇప్పటివరకు అప్లయ్ చేయనివారు లేదా గతంలో అప్లయ్ చేసినప్పటికీ సరైన సర్టిఫికేట్లు అందించని వారు మాత్రమే కొత్తగా అప్లయ్ చేసుకోవచ్చు.
Read Also : Bad Loan vs Good Loan : లోన్ మంచిదా.. చెడ్డదా? మీ అప్పు ఏ కేటగిరీలో ఉందో ఇలా తెలుసుకోండి!
ఏ డాక్యుమెంట్లు అవసరం? :
వితంతువులు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఒంటరి మహిళలు సెపరేషన్ సర్టిఫికెట్ లేదా లోకల్ ఎంక్వైరీ రిపోర్టు ఇవ్వాలి. గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ వెరిఫికేషన్, చేనేత కార్మికులు సంబంధిత చేనేత-జౌళి శాఖ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తులకు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలి.
ఆగస్టు 31 వరకే ఛాన్స్ :
కొత్తగా అర్హత పొందినవారు ఆగస్టు 31లోపు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ల వివరాలను పొందిన వెంటనే చేయూత ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తారు. అనంతరం క్షేత్రస్థాయి విచారణ పూర్తిచేసి అర్హుల జాబితాను జిల్లా అధికారులకు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం తర్వాత పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది.
ఒంటరి మహిళలు, వితంతువుల దరఖాస్తు, సర్టిఫికేషన్ల విషయంలో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు సహకరించనున్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో మధ్యవర్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు.
