AP Rains: బలపడిన ఉపరితల ఆవర్తనం.. ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు (AP Rains)కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Meteorological Department warning of possible heavy rains in ap for next three days.
AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుందని అధికారులు పేర్కొన్నారు.
కోస్తాంధ్ర, యానాం.. ఈదురుగాలులతో వర్షాలు:
ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం పరిధిలో శని, ఆది, సోమవారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(AP Rains) పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ జల్లులు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
రాయలసీమ వాతావరణం.. ప్రజలకు, రైతులకు హెచ్చరిక:
రాయలసీమ ప్రాంతంలో కూడా శని, ఆదివారాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే సోమవారం నాటికి వాతావరణంలో మార్పులు మరింత పెరిగి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
