Vikarabad Bus Accident: అనంతగిరి ఘాట్లో దారుణం.. ప్రైవేటు బస్సు బోల్తా.. నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి!
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో తీవ్ర విషాదం(Vikarabad Bus Accident) చోటుచేసుకుంది.
Vikarabad ananthagiri ghat road bus accident four women killed
Vikarabad Bus Accident: తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో తీవ్ర అలజడి రేగింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఈ ఊహించని ప్రమాదం జరగడంతో స్థానికులు, తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నలుగురు మహిళలు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కేసారం నుంచి వికారాబాద్ జిల్లా చింతకుంటకు 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు(Vikarabad Bus Accident) ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
కలెక్టర్ పరిశీలన.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి:
ప్రమాద వార్త తెలియగానే వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
