Vikarabad District : ఇంట్లో గొడవ.. ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన తల్లి.. చివరకు తీవ్ర విషాదం..
Vikarabad District : వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
Vikarabad District
Vikarabad District : కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఓ వివాహిత తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మాటుగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లి మమత (32)తోపాటు కుమారుడు సాకేత్ (8), కుమార్తె జాన్విక (6) మృతి చెందారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం మాటుగూడ గ్రామానికి చెందిన ఉప్పరి రాజు, ఆయన భార్య మమత మధ్య గురువారం గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మమత శుక్రవారం తన ఇద్దరు పిల్లలు సాకేత్, జాన్వికలను వెంట తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో చంగోముల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
శనివారం ఉదయం సుమన్గుర్తి గ్రామ సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీ వద్ద వ్యవసాయ బావి దగ్గర మహిళకు చెందిన చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ కనిపించడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పరిగి సీఐ కొండల్‌రెడ్డి, చంగోముల్ ఎస్సై భరత్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని బావిని పరిశీలించారు.
గ్రామస్తుల సహకారంతో బావిలో గాలింపు చేపట్టగా మమతతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు సాకేత్, జాన్విక మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నపాటి కుటుంబ మనస్పర్థలు విషాదానికి దారితీసి, తల్లితోపాటు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
