Virat Kohli : మూడో వన్డేలో కోహ్లీ గోల్డెన్ డక్.. డకౌట్ల కింగ్ రికార్డుకు అతి చేరువలో..
వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
IND vs WI 3rd ODI Virat Kohli bags 41st international duck
Virat Kohli : వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్ పేసర్ జేడెన్ సీల్స్ అద్భుతమైన బంతితో కోహ్లీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. 2025 చివరిలో ఆస్ట్రేలియా పర్యటన తరువాత కోహ్లీ వన్డేల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఆ పర్యటనలో కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్లు అయ్యాడు.
బిత్తరపోయిన కోహ్లీ..
మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. గత మ్యాచ్ (రెండో వన్డేలో) ద్విశతకంతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. 6 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో షై హోప్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
Golden duck for Virat Kohli.#INDvsWI #Viratkholi pic.twitter.com/bzcMsGNFlW
— Deepak Meena (@Iamdeep0408) October 3, 2026
వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ తొలి బంతికే ఔట్ అయ్యాడు. సీల్స్ వేసిన బంతి మిడిల్ స్టంప్ వైపు పిచ్ అయి అదే లైన్లో దూసుకొచ్చింది. దాన్ని ఫ్లిక్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నించి విఫలం అయ్యాడు. బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో పరుగుల ఖాతా తెరవకముందే కోహ్లీ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
కాగా.. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి ఇది 41వ డకౌట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాంత్ శర్మను అధిగమించి.. టీమ్ఇండియా తరుపున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో జహీర్ ఖాన్ ఉన్నాడు. అతడు 43 సార్లు డకౌట్లు అయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్లు అయిన ఆటగాళ్లు వీరే..
* జహీర్ ఖాన్ – 303 మ్యాచ్‌ల్లో 43 సార్లు
* విరాట్ కోహ్లీ – 565 మ్యాచ్‌ల్లో 41 సార్లు
* ఇషాంత్ శర్మ – 199 మ్యాచ్‌ల్లో 40 సార్లు
* జస్ప్రీత్ బుమ్రా – 241 మ్యాచ్‌ల్లో 37 సార్లు
* హర్భజన్ సింగ్ – 365 మ్యాచ్‌ల్లో 37 సార్లు
* అనిల్ కుంబ్లే – 401 మ్యాచ్‌ల్లో 35 సార్లు
* రోహిత్ శర్మ – 517 మ్యాచ్‌ల్లో 34 సార్లు
* సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌ల్లో 34 సార్లు
