ఉన్న డబ్బు చాలదన్నట్టు ఇప్పుడు 1,000,000,000,000 డాలర్ల వేతన ప్యాకేజీ.. నిరాడంబర జీవితాన్ని గడిపే మస్క్ ఇప్పుడు ఈ డబ్బంతా..
అంత డబ్బుతో ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సమస్యను అంతం చేయడమే కాకుండా అమెరికాలోని 3 టాప్ ఆయిల్ కంపెనీలను కూడా కొనుగోలు చేయవచ్చు.
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ, ఎప్పుడూ పొందని స్థాయిలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు వేతన ప్యాకేజీ ఇవ్వడానికి ఆ కంపెనీ షేర్‌హోల్డర్లు అంగీకరించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద వేతన ఒప్పందం ఇది.
తమ కంపెనీ వార్షిక సమావేశంలో 1 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.88 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీకి సంబంధించిన ఒప్పందం ఆమోదం పొందిన ఆనందంలో టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్‌తో కలిసి ఎలాన్ మస్క్ డ్యాన్స్ చేశారు. 1 తరువాత 12 సున్నాలు పెడితే 1 ట్రిలియన్ అవుతుంది. అంత డబ్బుతో ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సమస్యను అంతం చేయడమే కాకుండా అమెరికాలోని 3 టాప్ ఆయిల్ కంపెనీలను కూడా కొనుగోలు చేయవచ్చు.
పేదోడిలా జీవిస్తారు..
మస్క్ ఇప్పటికే ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరు. టెస్లా షేర్‌హోల్డర్లు ఆమోదించిన ఈ 1 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఆయనను ఇంకా ధనవంతుడిని చేస్తుంది. విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడని మస్క్ ఈ డబ్బును ఎలా ఖర్చు చేస్తారనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోందది.
అనేక ఇంటర్వ్యూల్లో మస్క్ తాను చాలా నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతానని, తన వద్ద తక్కువ వస్తువులు ఉంటాయని, ఇలా ఉండడమే తనకు ఇష్టమని చెప్పారు. విలాసవంతమైన భవనాలు, అధిక ఖరీదైన ఫుడ్ లాంటి వాటిపై ఆయన ఖర్చు చేయరు.
“అతను బిలియనీర్‌లా ఉండడంలేదు. కొన్నిసార్లు దారిద్ర్య రేఖ కంటే తక్కువ స్థాయిలో జీవిస్తారు” అని మస్క్ మాజీ పార్ట్‌నర్ గ్రైమ్స్ 2022లో వానిటీ ఫెయిర్ మ్యాగజైన్‌కి చెప్పారు. గ్రైమ్స్ తెలిపినట్లుగా.. మంచానికి రంధ్రం ఉన్నప్పటికీ మస్క్ కొత్త మంచం కొనడానికి నిరాకరించారు.
Also Read: మందుబాబులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్.. ఎప్పటినుంచంటే..
గ్రైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్‌తో ఆమె సెక్యూరిటీ లేకుండా $40,000 విలువజేసే ఇంట్లో ఉండేవారు. మస్క్ ఎంత నిరాడంబరంగా ఉంటారో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ధోరణి డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించిందని, అందుకే ఆయన ఫెడరల్ నిధులను తగ్గించే “డోజ్” విభాగం బాధ్యతలను మస్క్‌కు అప్పగించారని వార్తలు వచ్చాయి.
దీంతో ఈ 1 ట్రిలియన్ డాలర్ల వేతనాన్ని విలాసవంతమైన భవనాలు కొనడానికి మస్క్ ఖర్చు చేసే అవకాశములేదని భావిస్తున్నారు. 2020 నుంచి 2021 మధ్య మస్క్ కాలిఫోర్నియాలోని 7 ఇళ్లను 100 మిలియన్ డాలర్లకు విక్రయించారు.
ఆ ప్రాపర్టీలు బెల్ ఎయిర్‌లో ఉన్నాయి. బియాన్సే, లేడీ గాగా, జెన్నిఫర్ అనిస్టన్, టేలర్ స్విఫ్ట్ వంటి ప్రముఖులు నివసించే ప్రాంతం అది.
“నాకు డబ్బు అవసరం లేదు. నా జీవితాన్ని భూమి, మార్స్‌కే అంకితం చేస్తున్నాను. ఆస్తులు మనసును భారంగా మారుస్తాయి” అని మస్క్ అప్పట్లో ట్వీట్ చేశారు. ఆయన టెక్సాస్ దక్షిణం వైపుగా ఉండే 375 చదరపు అడుగుల చిన్న ఇంటికి మారారు.
ప్రస్తుతం అదే ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న ఏకైక ఇల్లు అని తెలుస్తోంది. అయితే, ఆయన 11 మంది పిల్లలు, ముగ్గురు మాజీ భాగస్వాముల కోసం టెక్సాస్‌లో 14,400 చదరపు అడుగుల కాంపౌండ్‌ను 35 మిలియన్ డాలర్లకు రహస్యంగా కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి.
మస్క్ వాహనాలు, జెట్లు ఇవే..
ఇళ్లు కొనడం ఆయనకు ఇష్టం లేకపోయినా, వాహనాలు, జెట్లు, ప్రత్యేక ఆటోమొబైల్స్‌పై అంటే మస్క్‌కు ఆసక్తి ఎక్కువ. ఆయన వద్ద గల్ఫ్‌స్ట్రీమ్ మోడళ్లతో కూడిన ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. వాటి విలువ కోట్ల డాలర్లలో ఉంటుంది.
ఆయన వద్ద ఉన్న కార్లలో ఫోర్డ్ మోడల్ టీ ఉంది. 20వ శతాబ్దంలో తయారైన తొలి సాధారణ కారుగా గుర్తింపు పొందినది. అలాగే 1967 జాగ్వార్ ఈ-టైప్ రోడ్‌స్టర్, 1997 మెక్లారెన్ ఎఫ్1, టెస్లా రోడ్‌స్టర్ కూడా ఉన్నాయి. 2018లో టెస్లా రోడ్‌స్టర్‌ను ‘స్టార్‌మాన్’ అనే మానకిన్‌తో కలిసి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు.
మస్క్ కలెక్షన్‌లో అత్యంత అరుదైనది 1976లో వచ్చిన లోటస్ ఎస్ప్రిట్ కారు. ఇది 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ సినిమా ‘ది స్పై హూ లవ్డ్ మీ’లో కనిపించింది. ఆ సినిమాలో ‘వెట్ నెల్లీ’గా పిలిచే ఈ కారు నీటమునిగి సబ్‌మరైన్‌లా మారుతుంది. మస్క్ ఈ కారును దాదాపు 1 మిలియన్ డాలర్లకు వేలంలో కొనుగోలు చేశారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన మస్క్ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కానీ ఆయన దాతృత్వం అస్తవ్యస్తంగా ఉంటుందని, స్వప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని న్యూ యార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం మస్క్ ఫౌండేషన్ విరాళాలు భారీ పన్ను రాయితీలు పొందడానికే కాకుండా తన వ్యాపారాలకు సహకరించే సంస్థలకే వెళ్లాయి.
