Orange Cultivation : బత్తాయి తోటల్లో పురుగుల ఉధృతి – నివారణకు సరైన యాజమాన్యం  

ఈ పరిస్థితుల్లో నల్లిపురుగులు, పండ్లనుండి రసంపీల్చే రెక్కల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Orange Cultivation : బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. బత్తాయి తోటలు  ఎక్కువగా తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో  అధికంగా  సాగు చేస్తున్నారు. ప్రస్థుతం   బత్తాయి కొన్ని ప్రాంతాల్లో  కోత దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పిందె దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నల్లిపురుగులు, పండ్లనుండి రసంపీల్చే రెక్కల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి పంట మూడవ స్థానాన్ని ఆక్రమిస్తోంది . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో  బత్తాయి  విస్థీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్థుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా, మరికొంతమంది రైతులు వర్షాకాలం అంటే సీజన్ పంటను తీసుకంటున్నారు. శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ పిందె దశలో వుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మంగు నల్లి ఆశించి విపరీతంగా నష్టం కలిగిస్తోంది.

ఈ నల్లి కాయలపై రసం పీల్చటం వలన ముదురు గోధుమ రంగు లేదా ఊదారంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. దీంతో కాయలు చిన్నవిగా ఉండి తోలు గట్టిగా, పెళుసుగా తయారవుతున్నాయి. వీటికి సరైన మార్కెట్  ధర పలకదు. మంగునల్లి  నివారణకు  డై కోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 2 నుండి 3 మిల్లి లీటర్లు లేదా డైఫెన్ థురాన్ 1.5 గ్రాములు లేదాథయోమిథాక్సోమ్ 1 మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

ముఖ్యంగా కోత దశలోని కాయలను రెక్కల పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటిని ఫ్రూట్ మాత్ అంటారు. పండ్లపై సన్నని రంధ్రం చేసి రసం పీల్చేయటం వల్ల కాయలు పక్వానికి రాకముందే పండి రాలిపోతాయి. రంధ్రాలలో శీలీంధ్రాలు, బాక్టీరియాలు చేరి పండ్లు కుళ్ళిపోతాయి. దీనినే డాగు అంటారు. రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. రాత్రి వేళల్లో లైట్ల కాంతికి ఈ రెక్కల పురుగు ఆకర్షింపబడుతుంది.

హెక్టారుకు ఒక ఫ్లోరోసెంట్ బల్బును కాయలు పక్వానికి రాక ముందే  ప్రతి రోజు రాత్రి 7 నుండి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. సాధారణంగా కాయ కోతకు వచ్చే నెలల్లో దీపపు ఎరలను పెట్టుకోవాలి. లైట్ల క్రింద మలాథియాన్ 1 మిల్లి లీటరు, పంచదార  1 శాతం..  పండ్ల రసంలో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగులను అరికట్టాలి. కాయలకు బుట్ట కట్టటం వల్ల  రక్షణ ఏర్పడుతుంది. తోట చుట్టూ ఉన్న పొదలను, తిప్ప తీగలను తీసివేస్తే ఈ రెక్కల పురుగు బెడదను తగ్గించుకోవచ్చు.

Read Also : Groundnut Varieties : ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు.. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి!

ట్రెండింగ్ వార్తలు