Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట.. ఇకముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక

‘మోదీ ఇంటి పేరు’ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.

Rahul Gandhi,

Modi surname case: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. ‘మోదీ ఇంటి పేరు’ ను కించపరిచారని 2019లో రాహుల్ గాంధీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. తాజాగా, రాహుల్‌కు పడిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది. రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పార్లమెంట్ కు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని కోర్టుకు తెలిపారు.

Modi Surname Case: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ

పూర్తి వాదనలు విన్నతరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ గాంధీకి సూరత్ ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతి ఎక్కువగా రెండేళ్ల శిక్ష విధించడానికి గల కారణాలను ట్రయల్ కోర్టు చెప్పలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పరువు నష్టం కేసు తీవ్రమైనది కాదు, బెయిల్ ఇచ్చే కేసు. ఈ అతిశిక్ష వల్ల పరిణామాలు తీవ్రంగా పడతాయని సుప్రింకోర్టు పేర్కొంది. తాను ఎన్నుకున్న ప్రజలతోపాటు, తన రాజకీయ జీవితం పైన ప్రభావం పడుతుంది. ఈ అంశాలన్నీ మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ట్రయల్ జడ్జీ తీర్పును నిలిపివేస్తున్నాం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇకముందు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని హెచ్చరించింది. సుప్రీంకోర్టు స్టే‌తో రాహుల్ గాంధీ పై అనర్హత వేటు తొలగిపోనుంది.

Rahul Gandhi : రాహుల్ గాంధీకి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం.. గోవా నుంచి ఢిల్లీకి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్కపిల్లలు

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్షవిధించింది. దీనికితోడు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈ కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తరువాత శిక్షపై స్టే విధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటీషన్ వేయగా కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది.

ట్రెండింగ్ వార్తలు