SALESHWARAM FESTIVAL : సాహస యాత్ర సలేశ్వరం.. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం.. తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా ప్రసిద్ధి..

దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం.. అడుగడుగునా గుట్టలు, కొండలు.. వాటిని దాటుకుంటూ కాలి నడకన వెళ్తుంటే.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చెవులను సన్నగా మీటే పక్షుల రాగాలు, గుట్టల పైనుంచి ....

SALESHWARAM FESTIVAL : దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం.. అడుగడుగునా గుట్టలు, కొండలు.. వాటిని దాటుకుంటూ కాలి నడకన వెళ్తుంటే.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చెవులను సన్నగా మీటే పక్షుల రాగాలు, గుట్టల పైనుంచి జాలువారే నీటి చప్పుడు.. అచ్చం అమర్ నాథ్ యాత్రకు వెళ్లే అనుభూతి కలుగుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో దట్టమైన నల్లమల అడవుల్లో ఉంది సలేశ్వరం లింగమయ్య స్వామి ఆలయం.

ప్రతీయేటా ఇక్కడ ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. గత రెండేళ్లుగా కొవిడ్ నిబంధనల కారణంగా సలేశ్వరం జాతర వాయిదా పడింది. ఈ యేడాది కొవిడ్ ఉధృతి తగ్గడంతో శుక్రవారం నుంచి జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది మూడు రోజులే ఉత్సవాలు జరగనున్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ పులల అభయారణ్య ప్రాంతంలోని సలేశ్వర క్షేత్రం సందర్శన చేయాలంటే సాహసం చేయాల్సిందే. జనావాస ప్రాంతానికి 25 కి.మీ దూరంలో దట్టమైన కీకారణ్యంలోని సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య స్వామి ప్రత్యేక ఉత్సవాలు 15 నుంచి 17వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

అయితే ఈ ఏడాది ఉత్సవాలకు మూడు రోజులే అనుమతి ఇవ్వడంతో పాటు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే అటవీ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు అటవీ శాఖ అనుమతులు ఇచ్చారు. రాత్రవేళల్లో వెళ్లేందుకు పూర్తిగా నిషేధించారు.

నల్లమల్ల అభయారణ్యంలోని సలేశ్వరానికి వెళ్లాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్ మార్గాల గుండా వచ్చే భక్తులు మన్ననూరు నుంచి 16 కి.మీలు దాటాక పర్హాబాద్ బేస్ క్యాంపు వద్ద గల చెక్ పోస్టు నుంచి మట్టి మార్గంలో మరో 16 కి.మీ ప్రయాణిస్తే రాంపూర్ పెంట వస్తుంది. అక్కడి నుండి కాలి నడకన కొండలు దిగితే సలేశ్వర క్షేత్రం వస్తుంది. మరో మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి నుంచి గిరిజా గుండాల వరకు వాహనాలు రానుండగా అక్కడ నుండి కాలి నడకన సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు