4th BJP CM Vijay Rupani : 6 నెలల్లోనే నలుగురు సీఎంలు రాజీనామా.. బీజేపీ వ్యూహం ఇదేనా?

బీజేపీలో సీఎంల మార్పు పర్వం కొనసాగుతోంది. కేవలం ఆరు నెలల్లోనే నలుగురు బీజేపీ సీఎంలు తమ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేరారు.

4th BJP CM Vijay Rupani : బీజేపీలో సీఎంల మార్పు పర్వం కొనసాగుతోంది. కేవలం ఆరు నెలల్లోనే నలుగురు బీజేపీ సీఎంలు తమ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేరారు. దాంతో సీఎం పదవికి రాజీనామా చేసిన నాల్గో బీజేపీ ముఖ్యమంత్రిగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. గుజరాత్‌లో వరుసగా మూడోసారి అధికారంలో వచ్చేందుకు బీజేపీ వచ్చే ఏడాదిలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

ముందుగా ఉత్తరాఖండ్‌తో ఈ బీజేపీ సీఎంల మార్పు ప్రారంభమైంది. సుమారు నాలుగేళ్లపాటు ఉత్తరాఖండ్‌ సీఎంగా కొనసాగిన త్రివేంద్ర సింగ్‌ రావత్‌ 2021 ఏడాది మార్చి 10న తన పదవికి రాజీనామా చేశారు. అదే రోజున తీరత్ సింగ్ రావత్ కొత్త సీఎంగా ప్రమాణం బాధ్యతలు చేపట్టారు. 116 రోజులు సీఎంగా కొనసాగిన ఆయన 2021 జూలై 4న అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే పుష్కర్ సింగ్ ధామి కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. ఉత్తరాఖండ్‌లో కొన్ని నెలల్లోనే ఇద్దరు సీఎంలు రాజీనామా చేయడం గమనార్హం.

మరోవైపు.. 2021 ఏడాది జూలై 26న కర్ణాటక సీఎం బీఎస్‌ యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు. సీఎంగా ఆయన రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. యడ్యూరప్ప స్థానంలో సీఎంగా జూలై 28న బసవరాజ్ బొమ్మై సీఎంగా ప్రమాణం చేశారు. నాలుగేళ్ల పాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విజయ్‌ రూపానీ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు.
Next Gujarat CM : విజయ్ రూపానీ రాజీనామా.. కొత్త సీఎం రేసులో ఎవరంటే?

గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. కొత్త సీఎం రేసులో నలుగురు నేత‌లు ఉన్నార‌నే ప్ర‌చారం జోరుగా కొనసాగుతోంది. కొత్త సీఎం రేసులో కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ‌, గుజరాత్‌ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్‌, మరో కేంద్ర మంత్రి పురుషోత్త‌మ్ రూపాలా, ఎంపీ సీఆర్ పాటిల్‌ పేర్లు ముందు వరుసలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

యడ్యూరప్ప తనపై అతని కుమారుడిపై ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర విభాగంలోని ఒక వర్గం ఆయన్ను తొలగించాలని పిలుపునిచ్చింది. ఉత్తరాఖండ్‌లో, త్రివేంద్ర రావత్‌ని ఆ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. ఆయన వారసుడు అయిన తిరత్ సింగ్ రావత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, తిరథ్ సింగ్ రావత్ కేవలం నాలుగు నెలలకే రాజీనామా చేశారు.

2021 ఏడాదిలో ఆరంభంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మార్పుపైనా బలమైన ఊహాగానాలు వచ్చాయి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొన్నారు. బీజేపీ సీనియర్‌ నేతలు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం సీఎం యోగిని మార్చబోయేది లేదని పార్టీ స్పష్టం చేసింది.

గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పాత సీఎంలను పక్కనపెట్టి కొత్త సీఎంలతో ఎన్నికలకు వెళ్లడమే బీజీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పాత సీఎంలను బీజేపీ అదిష్టానం వారితో బలవంతంగా రాజీనామా చేయించారనే టాక్ నడుస్తోంది.
Gujarat : సీఎం విజయ్ రూపానీ రాజీనామా

ట్రెండింగ్ వార్తలు