ఓటు వేయడానికి బద్దకిస్తున్నారా.. ఇన్‌స్పిరేష‌న్‌ కోసం ఈ వీడియో చూడండి

గుజరాత్ నడియాడ్‌లోని అంకిత్ సోనీ అనే ఓటరు తన పాదాల ద్వారా ఓటు వేసి అందరి మెప్పు పొందారు. ఎందుకంటే ఆయనకు రెండు చేతులు లేవు.

Ankit Soni casts his vote through his feet (Photo Source: @ANI)

Appeal to people to come out and vote: ఎన్నికల సంఘం ఎంత ప్రచారం చేసినా, ఎన్ని ఏర్పాట్లు చేసినా చాలా మంది ఓటు వేసేందుకు బద్దకిస్తుంటారు. పోలింగ్ రోజున సెలవు ఇచ్చినా రకరకాల సాకులతో ఓటు వేయడానికి రానివారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటుహక్కును వినియోగించుకోవాలని ఈసీ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టేవారు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మాల్సిందే. ముఖ్యంగా నగర ఓటర్లు పోలింగ్ రోజున ఇల్లు కదలడం లేదని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 26న బెంగళూరులో జరిగిన లోక్‌స‌భ రెండో దశ ఎన్నిక‌ల‌ పోలింగ్‌లో ఓటింగ్ 55 శాతం కూడా మించలేదంటే మనోళ్లు ఎంత బద్దకంగా ఉన్నారో అర్థమవుతోంది.

అయితే ఓటు విలువ తెలిసి తమ హక్కును వినియోగించుకునే వారూ లేకపోలేదు. ప్రత్యేక అవసరాలు కలిసిన దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తున్నారు. తాజా ఎన్నికల్లో గుజరాత్ నడియాడ్‌లోని అంకిత్ సోనీ అనే దివ్యాంగ ఓటరు తన పాదాల ద్వారా ఓటు వేసి అందరి మెప్పు పొందారు. ఎందుకంటే ఆయనకు రెండు చేతులు లేవు. తనకు చేతులు లేకపోయినా పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటు వేశారు.

Also Read: ఐరన్ చేయని బట్టలేసుకుని ఆఫీసుకు రండి.. సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం

“20 ఏళ్ల క్రితం కరెంటు షాక్‌తో రెండు చేతులు పోగొట్టుకున్నాను. నా గురువుల ఆశీస్సులతో నేను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. పోలింగ్ డే నాడు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కచ్చితంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఏఎన్ఐ వార్తా సంస్థతో అంకిత్ అన్నారు. అంకిత్ సోనీ ని స్ఫూర్తిగా తీసుకుని ఓటర్లు అందరూ తప్పసరిగా ఓటు వేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌స‌భ నాలుగో దశ ఎన్నిక‌ల‌ పోలింగ్‌ జరగనుంది. ఓటు ఉన్న ప్రతిఒక్కరు తమ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి.