Gautam Adani : అన్నింటా ఆదానీయే .. వంటనూనెల నుంచి విద్యుత్‌ వరకూ .. పోర్టుల నుంచి మీడియా రంగం వరకు…

అన్నింటా ఆదానీయే అన్నట్లుగా ఉంది ఆదానీ కంపెనీల హవా... వంటనూనెల నుంచి విద్యుత్‌ వెలుగుల వరకూ .. పోర్టుల నుంచి మీడియా రంగం వరకు...ఇలా అన్నింటి విస్తరిస్తున్నాయి ఆదానీ కంపెనీలు..NDTVని టేకోవర్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నం.. బిజినెస్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Gautam Adani : అదానీ.. ఇప్పుడిది పేరు కాదు బ్రాండ్‌ ! అదీ ఇదీ అని కాదు.. ప్రతీ వ్యాపారంలో అడుగు పెట్టారు. లాభాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మీడియా రంగంలోకి కూడా ఎంటర్ అయ్యారు. NDTVని దాదాపు సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. అదానీ ఎంట్రీని ఆపుదామని అనుకున్నా.. అడ్డుకోలేని స్థాయికి తన స్ట్రాటజీలు అమలు చేశారు. ఇదే బిజినెస్ వర్గాలను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఎన్డీటీవీ సొంతం చేసుకోవడం వెనక.. అదానీ గ్రూప్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి.. అదానీ ఒక్కసారిగా కన్నేస్తే ఇక అంతేనా.. ఈ టోటల్ ఎపిసోడ్‌ చెప్తోంది ఏంటి ?

గౌతమ్ అదానీ.. పరిచయం అవసరం లేని పేరు. వ్యాపారం మొదలుపెడదామని కలలు కంటారు కొందరు.. మొదలు పెట్టి వేగంగా అడుగులు వేస్తుంటారు ఇంకొందరు.. అదానీ మాత్రం మూడోరకం ! నడుస్తున్న వ్యాపారాలను ఎలాగైనా చేజిక్కించుకునే రకం ! కొందరు అవకాశాలు గుర్తిస్తారు.. కొందరు అందుకుంటారు. అదానీ మాత్రం సృష్టించుకుంటారు. పక్కాగా లెక్కలేసి హస్తగతం చేసుకుంటున్నారు. ఆ స్టైలే ఆయనను భారత వ్యాపార రంగానికి మకుటం లేని మహారాజుగా నిలిపింది. అదానీ అంటే పేరు కాదు.. బ్రాండ్‌ అనేంతలా మార్చేసింది. కలలు ఎవరైనా కంటారు.. ఆ కల కోసం ఏమైనా చేస్తారు చూడండి.. అదే రకం అదానీ ! అదీ ఇదీ అని కాదు.. అన్ని రంగాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పోర్టుల నుంచి పవర్ ప్లాంట్ల వరకు.. సిమెంట్‌ కంపెనీల నుంచి మీడియా వరకు.. ప్రతీ వ్యాపారాన్ని ఆయన అందుకుంటున్న తీరే.. కార్పొరేట్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయే లెవల్‌లో ఉంటోంది.

NDTVని టేకోవర్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నం.. బిజినెస్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్కడి విశ్వప్రధాన సంస్థ.. ఎక్కడి ఎన్డీటీవీ.. ఎక్కడి అదానీ గ్రూప్‌.. తవ్వుకుంటూ పోతే.. ఒక్క పరిణామం లింక్‌ చేసుకుంటూ పోతే.. ఎన్డీటీవీ ఎపిసోడ్‌లో ప్రతీ క్లైమాక్స్ అనిపించే సంఘటనలు కనిపిస్తున్నాయ్. అదానీ అనుకుంటే.. అనుకొని కన్నేస్తే.. ఆ ఎత్తులు ఎలా ఉంటాయ్‌.. స్ట్రాటజీలు ఎలా చిక్కులు పెడతాయో.. పక్కాగా అర్థం అవుతోంది.

ఈ కథ సరిగ్గా 12 ఏళ్ల కింద మొదలైంది. అదానీ, NDTV ఎపిసోడ్‌లో స్టోరీ అంతా విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూనే తిరుగుతోంది. 2008లో రిజిస్టరైన VCPL… ఇప్పటిదాకా చేసిన ఒకే ఒక్క బిజినెస్ NDTV ప్రమోటింగ్ సంస్థ RRPRకు అప్పు ఇవ్వడం మాత్రమే. NDTV ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికారాయ్‌కు… 2009లో 350 కోట్లు, 2010లో 53 కోట్లు ఈ సంస్థ అప్పుగా ఇచ్చింది. RRPR తరపున విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ ఇద్దరు అప్పు తీసుకున్నారు. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన అప్పుకు బదులుగా RRPRలో 99.99శాతం వాటా దక్కేలా వారెంట్లను ఈక్విటీగా VCPL మార్చుకోవచ్చు. ఆ అగ్రిమెంట్ ఇప్పుడు ట్విస్టుకు కారణం అయింది.

2009 జూన్‌లో.. అంటే VCPL మొదటి అప్పు ఇవ్వడానికి ముందు.. ఎన్డీటీవీ గ్రూప్‌లో ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్ దంపతులకు 55శాతం వాటా.. ప్రమోటర్ గ్రూప్‌ అయిన RRPRకు 7.56 వాటా ఉండేది. ఐతే VCPLతో అగ్రిమెంట్‌ తర్వాత.. తమ పేరుతో ఉన్న షేర్లలో కొంత భాగాన్ని RRPRకు ఆ ఇద్దరు ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంతో NDTVలో RRPR హోల్డింగ్‌ వాటా 29.18కు చేరింది. అంబానీ గ్రూప్ నుంచి అప్పులు తీసుకొని.. ఎన్డీటీవీకి ఇచ్చిన VCPL సంస్థను ఇప్పుడు.. అదానీ గ్రూప్ టేకోవర్ చేసుకుంది. 2009 ఒప్పందాన్ని బయటకు తీసింది. వారెంట్లను ఈక్విటీగా మార్చేసింది. ఫలితంగా RRPRలో 99.50శాతం VCPL పరం కానుంది. అంటే పరోక్షంగా 29.18శాతం అదానీ గ్రూప్ చేతికి వచ్చినట్లే ! అయితే.. అంబానీల చేతుల్లో నుంచి అదానీ చేతుల్లోకి VCPL ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కడం లేదు.

ప్రస్తుతం ఎన్డీటీవీలో ప్రణయ్ రాయ్, రాధికారాయ్ ఇద్దరికి కలిపి 32.26శాతం వాటా ఉంది. అదానీ వాటా 29.18 శాతం. కార్పొరేట్ నిబంధనల ప్రకారం కనీసం 20శాతం వరకూ ఓపెన్ ఆఫర్‌కు వెళ్లవచ్చు. అదానీ గ్రూప్ మాత్రం ఏకంగా 26శాతం ఓపెన్ ఆఫర్‌కు వెళ్లింది. తన వాటాను 55శాతానికి పైగా పెంచుకుని NDTVని తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని అదానీ గ్రూప్ ఫిక్స్ అయింది. ఇలా ఇది కావాలి అనుకుంటే.. దక్కించుకునే వరకు అదానీ వదిలే రకం కాదు… ఇప్పుడు ఎన్డీటీవీ మాత్రమే కాదు.. గతంలో ఎన్నో ప్రాజెక్టులు, పోర్టులు.. ఇలా కైవశం చేసుకున్నవే ! సిమెంట్‌ రంగంలోనూ అదానీ గ్రూప్ దేశంలో రెండో అతిపెద్ద తయారీ సంస్థగా మారింది. అతిపెద్ద సిమెంట్ కంపెనీలు అంబుజా, ACC సిమెంట్స్‌ను ఇలాంటి స్ట్రాటజీతోనే అదానీ గ్రూప్ తమ సొంతం చేసుకుంది. అంబుజా, ACC సిమెంట్స్‌ కంపెనీలను.. స్విస్ కంపెనీ హోల్సిమ్ నుంచి 81వేల కోట్లకు అదానీ గ్రూప్ కొనేసింది. విదేశీ అనుబంధ సంస్థ ద్వారా అంబుజా సిమెంట్స్‌లో 63.19శాతం వాటాను అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది.

ఇది మాత్రమే కాదు.. విక్రయించే ఉద్దేశం కూడా లేని గంగవరం పోర్టును చాకచక్యంగా పావులు కదిపి సొంతం చేసుకున్నారు అదానీ. ప్రమోటర్ల నుంచి ముందే వాటాలు కొనుగోలు చేసి.. ప్రభుత్వం ముందు ఆప్షన్ పెట్టి.. చివరికి సొంతం చేసుకుంది. వంద శాతం వాటా దక్కించుకుంది. కృష్ణపట్నం పోర్టు విషయంలోనూ ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేసింది. ఇక జీవీకే గ్రూప్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ హక్కులు దక్కించుకోవడంలోనూ చాకచక్యంగా వ్యవహరించింది. వంట నూనెల నుంచి పవర్ ప్లాంట్ల వరకు.. బొగ్గు గనుల నుంచి ఎనర్జీ రంగాల వరకు.. ప్రతీ రంగంలోనూ అదానీ గ్రూప్ ఎంటర్ అయింది. ఇప్పుడు ఒడిశాలో అల్యూమినా రిఫైనరీ, ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది. తాను కన్నేస్తే ఎలా అయినా దక్కించుకోవాల్సిందే.. అది నెగ్గి అయినా.. తగ్గి అయినా ! NDTV ఎపిసోడ్‌తో ఇప్పుడు మరోసారి అదే ప్రూవ్ అయింది.

 

 

ట్రెండింగ్ వార్తలు