India Economy Growing : ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయం!

India Economy Growing : ప్రపంచం AI రంగంలోకి పరుగులు పెడుతున్న వేళ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ అద్భుతాలు సృష్టించబోతోందని నిపుణులు అంటున్నారు.

India Economy Growing : ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రపంచం AI రంగంలోకి పరుగులు పెడుతున్న వేళ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ అద్భుతాలు సృష్టించబోతోందని నిపుణులు అంటున్నారు. AI వినియోగం మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే ఐటీలో భారత్ అగ్రగామిగా ఉంది. ప్రపంచంతో పోటీ పడి వ్యాక్సిన్లు అందించిన ఫార్మా రంగం సుదూరలక్ష్యాలతో ముందుకు సాగుతోంది. మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ వంటి ఫలితాలు దేశమంతా కనిపిస్తున్నాయి. మొత్తంగా నవభారతం.. అభివృద్ధి భారత్‌గా సగర్వంగా ప్రపంచం ముందు నిలబడుతోంది.

Read Also : NASA Moon Train : చందమామపై చుక్.. చుక్.. బండి.. చంద్రునిపై వేగంగా నాసా పరిశోధనలు..!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి ప్రపంచాన్ని నడిపిచడంలో భారత్‌ది కీలక పాత్ర. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడం ద్వారా భారత్…AIలో ప్రపంచానికి నాయకత్వం వహించేస్థితికి చేరుకుంటుంది. ఈ మాటలన్నది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. గూగుల్‌తో పాటు మైక్రోసాఫ్ట్ తమ ఉత్పత్తులకు భారత్‌నే ప్రధానంగా చేసుకుంటున్నాయి. AI రంగంలోకి భారత్ మారడం చాలా సౌకర్యవంతంగా జరుగుతోందని కూడా సుందర్ పిచాయ అన్నారు. టెక్నాలజీ రంగంలో భారత్ దూసుకుపోతున్నతీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆరు నెలల కాలంలో AI వినియోగదారులు భారత్‌లో 84శాతం పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి.

ఐటీ రంగంలోనూ ప్రపంచానికి మార్కెట్‌‌గా భారత్ :
ఏఐ రంగంలోనే కాదు.. ఐటీ రంగంలోనూ భారత్ ప్రపంచానికి మార్కెట్‌గా మారింది. అమెరికా కంపెనీలకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది. ఇదే కాదు… రెండు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ఏ ఉత్పత్తి విజయం సాధించాలన్నా భారత్ మార్కెటే కీలక ఆధారంగా నిలిచింది. సంస్కరణల ఫలాలు కింది తరగతి ప్రజలకు సైతం వేగంగా చేరుతున్నాయి. నిర్మాణ రంగం ఊపందుకుంది. రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులు సృష్టించింది. విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడ్డాయి. స్టాక్ మార్కెట్లు దూసుకుపొయ్యాయి. ఫార్మా రంగంనుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌తో పాటు కొన్ని రకాల టీకా ఉత్పత్తులతో కరోనా కాలంలో అంతర్జాతీయంగా భారత్ సత్తా చాటింది. బ్యాకింగ్ రంగం ప్రభంజనాలు సృష్టించింది.

పాకిస్థాన్, శ్రీలంకతో పోలిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడడానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి మన ప్రభుత్వాలు చేసిన కృషే. ఆ పార్టీ, ఈ పార్టీ అన్నదానితో సంబంధం లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నవారంతా దేశాభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు. తొలుత భారీ పరిశ్రమలపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి. ఉపాధి స్థిరీకరణ తర్వాత చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి చేశాయి. మూడున్నర దశాబ్దాలుగా సంస్కరణలతో ఆర్థిక వృద్ధి కొత్త బాట పట్టించాయి. 77 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేసిన కృషి ఇప్పుడు ప్రపంచానికి కనిపిస్తోంది. అభివృద్ధిలో ఒక్కసారిగా వేగం పెరిగింది. భారత్ నిజమైన వృద్ధిని సాధిస్తోందన్న అభిప్రాయం వ్యాపిస్తోంది. ఇదే వృద్ధిరేటు కొనసాగితే.. 2026-27 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని 16వ ఆర్థిక సంఘం చైర్ పర్సన్ అవరింద్ పనగారియా తెలిపారు. గత 20 ఏళ్లలో భారత్ దాదాపు 8శాతం వృద్ధిని సాధించిందని, కోవిడ్ సహా, ప్రపంచ పరిణామాలను తట్టుకుని నిలిచిందని ఆయన విశ్లేషించారు.

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఫాక్స్‌కాన్ చైనాను వదిలిపెట్టి భారత్‌లో పరిశ్రమ ఏర్పాటుచేస్తోంది. ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలన్నీ భారత్‌లో బ్రాంచ్‌లు నెలకొల్పుతున్నాయి. హల్దీరామ్స్ వంటి భారతీయసంస్థలను చేజిక్కించుకునేందుకు అమెరికాకు చెందిన బ్లాక్ స్టోన్ ప్రయత్నాలు చేస్తోంది. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఇవన్నీ తెలియజేస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఎలాన్ మస్క్ టెస్లా ప్లాంట్ ఏర్పాటుపై మీనమేషాలు లెక్కపెట్టడం, గత నెల చివరివారంలో భారత పర్యటనను ఆకస్మికంగా రద్దుచేసుకుని చైనా వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ను తక్కువ అంచనావేయొద్దని ఆర్థిక నిపుణులతో పాటు హితులు, సన్నిహితులు మస్క్‌ను హెచ్చరిస్తున్నారు.

భారత్ వృద్ధిరేటును ఐక్యరాజ్యసమితి సవరించడం, మనం అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఎక్కువ సమయం లేదన్న అంచనాల నడుమ కొన్ని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వృద్ధిరేట్ల అంచనాలపై దేశంలో ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం లేకపోవడానికి కారణం.. దేశంలో పేదరికం తొలగకపోవడం. జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ…రోజువారీ జీవన వ్యయం భారీగా పెరగడం. అయితే ఆర్థిక నిపుణులు చెప్పే మాటేంటంటే పేదరికం తొలగించలేకపోయినప్పటికీ…స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో ఉన్న తీవ్ర పేదరికం పరిస్థితులు ఇప్పుడు లేవు.

తీవ్ర పేదరికం దాదాపు అంతమైపోయిందని..అయితే ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడడాన్ని మరింతగా తగ్గించి..పారిశ్రామిక సేవల వైపు మళ్లించడం ద్వారా గ్రామీణ భారతాన్నీ సుసంపన్నంగా మార్చవవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవసరం లేకపోయినా ఒకే రంగంపై ఆధారపడి ఎక్కువమంది జీవించడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం..ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రచ్చన్న నిరుద్యోగిత గణనీయంగా తగ్గిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పట్టణాలు, నగరాలకు వలసలు మాత్రం పెనుభారంగా మారుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరముంది.

Read Also : India Economy Growing : అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌

ట్రెండింగ్ వార్తలు