India Economy Growing : అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌

టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కడం దగ్గరినుంచి మానవవనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించడం దాకా అన్ని రంగాల్లో భారత్ నిజంగానే దూసుకుపోతోంది.

India Economy Growing : అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌

Special Focus on India Economy Growing

India Economy Growing : భారత్ వెలిగిపోతోంది. 20 ఏళ్ల క్రితం అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయం చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఆ నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన బీజేపీ ఘోర ఓటమి పాలయింది. 20 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 77 ఏళ్ల స్వాతంత్ర్యం భారత్‌ను వెలుగుతీరాల్లోకి నడిపిస్తోంది.. గత కాలపు ప్రభుత్వాల ముందు చూపు, ప్రస్తుత ప్రభుత్వం కఠినశ్రమ కలిసి భారత్‌ను ప్రపంచాన్ని శాసించే ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతోంది. ఈ మాటలు చెబుతోంది అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు. భారత వృద్ధిరేటు అంచనాలను దాదాపు 7శాతానికి పెంచడం ద్వారా ఐక్యరాజ్యసమితి సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కడం దగ్గరినుంచి మానవవనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించడం దాకా అన్ని రంగాల్లో భారత్ నిజంగానే దూసుకుపోతోంది.

Read Also : NASA Moon Train : చందమామపై చుక్.. చుక్.. బండి.. చంద్రునిపై వేగంగా నాసా పరిశోధనలు..!

భారత్ పేద దేశం.. తృతీయ ప్రపంచ దేశం.. అభివృద్ధి చెందుతున్న దేశం…చిన్నప్పుడంతా మనం ఇదే చదువుకున్నాం… ఈ మాటలు వింటూనే పెరిగాం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా… ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడమేంటన్న అసంతృప్తీ, ఆవేదనా వెళ్లగక్కాం. కానీ ఇక అలాంటి అసంతృప్తులకు చోటు లేదు. మనం అభివృద్ధి చెందిపోయాం. ఎంతలా అంటే ఇంకో రెండేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలా మారిపోయేటంత. భారత్‌ను ఎంత మాత్రం తక్కవగా అంచనా వేయకూడదని ప్రపంచ దేశాలు జాగ్రత్త పడే అంత. టెస్లా కార్ల ఉత్పత్తికి ఎలాన్ మస్క్ భారత్‌ను కాకుండా చైనాను ఎంపిక చేసుకుని తప్పు చేశారన్న విశ్లేషణలు చేసే అంత.

సంస్కరణలు మంచివా.. చెడ్డవా అన్న సంగతి పక్కనపెడితే..1991 తర్వాత భారతదేశ స్వరూపం మారిపోయింది. వేగంగా వృద్ధి మొదలయింది. 2004 నాటికి సంస్కరణ ఫలాలు కనిపించడం మొదలయింది. దీన్ని ప్రతిబింబిస్తూ.. అప్పటి NDA ప్రభుత్వం భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. కానీ సంస్కరణ ఫలాలు కొందరికే అందడం, మరోవైపు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో వ్యవసాయం పెను భారంగా మారడం, ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం, ప్రయివేట్ ఉద్యోగాలు పూర్తిస్థాయిలో లభ్యమయ్యే పరిస్థితులు లేని సంధికాలంలో నిరుద్యోగం ఊహించని స్థాయిలో పెరగడం.. భారత్ వెలిగిపోతోందన్న ప్రచారానికి ప్రతికూలతలు సృష్టించాయి.

NDA కూటమి ఓటమిని నిర్దేశించాయి. అయితే ఆ తర్వాత కాలంలో సాఫ్ట్‌వేర్ విప్లవం, రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఫార్మా సహా అనేక రంగాల్లో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పును ప్రపంచ దేశాలు త్వరగానే గుర్తించాయి. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మనదేశ పర్యటనకు వచ్చి.. భారత్ ఇంకెంత మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశం కాదని…అభివృద్ధి చెందిన దేశమని అంటే ఎవరూ నమ్మలేదు. భారత్‌ను పేదదేశంగానే అంతా భావించారు. లాక్‌డౌన్ కాలంలో చీమలదండులా దేశ ప్రజలు నలుమూలలా చేసిన ప్రయాణాలు ఈ అంచనాలు నిజమే అనిపించాయి. కానీ లాక్‌డౌన్‌ కాలం నాటి పరిస్థితులు తాత్కాలికమే అని, మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉందని.. తర్వాతి పరిణామాలు రుజువుచేశాయి.

కరోనా పరిస్థితులతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలమయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం కుప్పకూలాయి. మన పొరుగు దేశం శ్రీలంక దివాళా తీసింది. దాయాది దేశం పాకిస్థాన్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కరోనా, రష్యా-యుక్రెయిన్ యుద్ధం వంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని..భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడింది. కరోనా కాలం ముగిసిన 2022 నాటికి భారత్ బ్రిటన్‌ను దాటి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. పారిశ్రామికీకరణతో లాభపడి.. ఒకనాడు భారత్‌ను పాలించిన బ్రిటన్ ఆర్థికస్థితిని…మనం అధిగగమించడమన్నది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ సంచలనాలే ఇంకా కొనసాగుతున్నాయి. ఆకాశమే హద్దుగా భారత్ దూసుకుపోతోంది.

తాజాగా భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను ఐక్యరాజ్యసమితి సవరించడంతో మన ఆర్థిక పరిస్థితులపై మరోసారి చర్చ జరుగుతోంది. దేశంలో వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతోంది. చేతికి ఎముక లేదన్న తరహాలో ప్రజలు ఖర్చుపెడుతున్నారు. జనాభా పరంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న భారత్… వినిమయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతోంది. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న కంపెనీలన్నింటికీ భారత్ మార్కెట్‌గా మారింది. ఈ పరిణామాలన్నీ కలిసి దేశంలో వృద్ధిరేటును వేగంగా పెంచుతున్నాయి. వృద్ధిరేటు అంచనా సవరణలో ఐక్యరాజ్యసమితి సైతం ఇదే విషయం వెల్లడించింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రయివేట్ వినియోగం పెరగడంతో వృద్దిరేటు గణనీయంగా పెరగడమే దీనికి కారణమని తెలిపింది.

ఈ ఏడాది 6.9శాతం, వచ్చే ఏడాది 6.6శాతం వృద్ధిరేటును భారత్ నమోదుచేస్తుందని యూఎన్ అంచనా. ఔషధ, రసాయనాల ఎగుమతులు బలంగా పుంజుకుంటున్నాయని, అయితే సరుకుల ఎగుమతి మాత్రం ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో వృద్ధిరేటు 6.2 శాతంగా చెప్పిన ఐక్యరాజ్యసమితి….ఇప్పుడు 0.7శాతం పెంచింది. నిజానికి వృద్ధిరేటు అంచనాలతో సామాన్యునికి పనిలేదు. అసలు ఇవి అందరికీ అర్ధమయ్యే లెక్కలు కూడా కాదు..నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు ఎంత ఉన్నాయన్నదే ప్రజలు గమనిస్తారు. ఆ రకంగా చూసుకుంటే…ఇప్పుడు ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రతి వస్తువు ధరా పెరుగుతోంది. ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ విషయంలోనూ ఐక్యరాజ్యసమితి శుభవార్త చెప్పింది. రిటైల్ ద్రవ్యోల్బణం గత ఏడాది 5.6శాతం ఉండగా ఈ ఏడాది 4.5శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది.

Read Also : NASA Moon Railway : మూన్‌ రైల్వేకు నాసా బృహత్తర ప్రయత్నం