NASA Moon Train : చందమామపై చుక్.. చుక్.. బండి.. చంద్రునిపై వేగంగా నాసా పరిశోధనలు..!

ఇలా బాల్యానికి, చందమామకు, రైలుకు విడదీయలేని బంధం ఉంది. రానున్న రోజుల్లో భావి తరాలు జాబిల్లిపై రైలు పాట పాడుకునే మహాద్భుత క్షణాలు రాబోతున్నాయి. ఆ దిశగా పరిశొధనలు వాయువేగంతో సాగుతున్నాయి.

NASA Moon Train : చందమామపై చుక్.. చుక్.. బండి.. చంద్రునిపై వేగంగా నాసా పరిశోధనలు..!

A railway will be built on Moon

NASA Moon Train : బాల్యంలో చందమామ అంటే.. ఎంతో అపురూపమైనదన్న భావన ఉంటుంది. నల్లని మబ్బుల చాటున తొంగి చూసే తెల్లని జాబిల్లిని చూపిస్తే చాలు..పిల్లల ఏడుపు మొత్తం ఎవరో తీసేసినట్టు మాయమవుతుంది. మేఘాల్లో వడివడిగా సాగిపోయే చంద్రుణ్ని.. కళ్లప్పగించి చూస్తారు పసిపిల్లలు. అలాగే చిన్ననాట పిల్లలు తప్పనిసరిగా చుక్‌ చుక్‌ రైలు వస్తోంది..దూరం దూరం జరగండి అని పాట పాడుతూ ఆడుకుంటారు. ఇలా బాల్యానికి, చందమామకు, రైలుకు విడదీయలేని బంధం ఉంది. రానున్న రోజుల్లో భావి తరాలు జాబిల్లిపై రైలు పాట పాడుకునే మహాద్భుత క్షణాలు రాబోతున్నాయి. ఆ దిశగా పరిశొధనలు వాయువేగంతో సాగుతున్నాయి.

చంద్రుణ్ని అందుకున్న కల సాకారమయిన తర్వాత మనిషి ఆలోచనలు జాబిల్లిపై నివాసం వైపుగా సాగాయి. చంద్రునిపై మనిషి స్థిరనివాసం ఏర్పరుచుకోవడానికి దశాబ్దాల కాలం చాలని, శతాబ్దాల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదని వరుస పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మిగిలిన గ్రహాలతో పోలిస్తే..మనిషికి చంద్రునితో ఉన్న అనుబంధం ఎక్కువ. నిర్మలమైన ఆకాశంలో నిండుజాబిలిని చూస్తే కలిగే భావన వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. కవులకు ఇది అద్భుతమైన కథావస్తువు. పూర్ణచంద్రుణ్ణి గురించి ప్రపంచవ్యాప్తంగా కవులు కలవరించి, పలవరించారు. పలవరిస్తూనే ఉంటారు.

అంతరిక్ష పరిశోధనారంగంలో చందమామపై పరిశోధనలు మనిషికి ఎంతో ప్రత్యేకంగా మారడానికి చందమామ అందరివాడు కావడమే కారణం. భావుకతను, ఊహాలోకాన్ని పక్కనుపెట్టి.. శాస్త్రీయ దృక్పథంతో గమనిస్తే.. భూమి, చంద్రుడు దగ్గర దగ్గరగా ఉంటారు. చంద్రుని ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ. మూడు రోజుల్లో జాబిల్లిని చేరుకోవచ్చు. దీంతో పాటు భూమి తర్వాత మనిషి నివసించడానికి అనువుగా ఉన్న గ్రహాల జాబితాలో చందమామ ముందువరుసలో ఉన్నాడు. అందుకే చందమామపై రైలు కూత వినిపింపచేయాలని నాసా ఉవ్విళ్లూరుతోంది.

చందమామ వింత వస్తువు కాదని.. భూమిలాంటి ఓ గ్రహమేనని, నల్లనిమచ్చగా మనం భావించేది నిజానికి మచ్చ కాదని, చంద్రునిపై ఉండే రాళ్లూ, రప్పల అవశేషాలని మనిషి గ్రహించిన తర్వాత జాబిల్లిని చేరుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు సఫలీకృతమైన తర్వాత నీటిజాడల కోసం అన్వేషణ సాగింది. మనిషి జీవనానికి అవసరమైన నీటిజాడలు చంద్రునిపై పుష్కలంగా ఉన్నాయని ఇస్రో పరిశోధనల్లో తేలిన తర్వాత జాబిల్లిపై ఆవాసం ఏర్పరచడం పరిశోధనాసంస్థల తక్షణ లక్ష్యంగా మారింది. చంద్రుని దక్షిణ ధృవంపైకి భారత్ రోవర్‌ను దింపిన తర్వాత ఆ గ్రహంపై ఎక్కడయినా పరిశోధనలు సాగించి..మనిషి జీవించేలా సౌకర్యాలు కల్పించవచ్చన్న భరోసా ఏర్పడింది. ఈ క్రమంలోనే రైల్వేస్టేషన్ నిర్మించాలన్న ఆలోచన నాసాకు వచ్చింది. ఆర్టెమిస్ ప్రయోగంలో భాగంగా ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్-ఫ్లోట్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసి చంద్రునిపై రైల్వేస్టేషన్ నిర్మించనుంది నాసా.

చందమామపై రైళ్లు ప్రయాణించే విధానానికి, భూమ్మీద ప్రయాణానికి చేలా తేడా ఉంది. భూమిని అంటిపెట్టుకుని ఉన్న తరహాలో జాబిల్లిపై రైళ్లు ప్రయాణించవు. తేలియాడుతున్నట్టుగా రైళ్ల ప్రయాణం ఉంటుంది. దుమ్ము, ధూళిని తగ్గించడానికి ఫ్లోట్ రోబోట్స్ డయామాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగిస్తారు. చంద్రునిపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తువులు, పరికరాలు తరలించేందుకు, చంద్రునిపై ఉండే వ్యోమగాములకు రవాణా సేవలు అందించేందుకు, మట్టి, ఇతర పదార్థాలను ఒక వైపు నుంచి ఇంకో వైపు తీసుకెళ్లేందుకు ఈ రైళ్లు ఉపయోగిస్తారు.

వ్యోమనౌక చంద్రునిపై దిగిన ప్రాంతం నుంచి.. ఇతర చోట్లకు అవసరమైన వస్తువులను ఈ రైళ్ల ద్వారా తరలిస్తారు. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో ఇంజనీర్లు ఫ్లోట్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. మాగ్నెటిక్ రోబోలకు మూడు పొరల ఫిల్మ్ ట్రాకులు ఉంటాయి. ఈ రోబోలు గంటకు 1.61 కిలోమీటర్లు ప్రయాణిస్తూ దుమ్మును తగ్గిస్తాయి. పట్టాలను రైళ్లు తాకకుండా ప్రయాణించడంలో ఈ రోబోలదే కీలక పాత్ర. రైల్వే రోబోటిక్ ట్రానస్‌పోర్ట్ సిస్టమ్ పూర్తిస్థాయి కార్యకలాపాలు సాగించడానికి ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన పనిలేదు. 2030 నాటికే ఈ వ్యవస్థ కార్యకలాపాలు సాగించాలన్న లక్ష్యంతో నాసా పనిచేస్తోంది.

చంద్రునిపై మనిషి నివాసాలు ఏర్పాటులో..ఈ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కీలకశక్తిగా వ్యవహరించనుంది. ప్రచ్ఛన్నయుద్దకాలంలో రష్యా, అమెరికా చంద్రునిపై పరిశోధనలకు పోటీపడితే..ఇప్పుడు అమెరికా, చైనా ఆ రేసులో నిలిచాయి. భారత్ మాత్రం ఆయా దేశాలతో సంబంధం లేకుండా విజయాలు సాధిస్తోంది. 2030నాటికి చంద్రునిపై బేస్ ఏర్పాటుచేయాలన్నది చైనా ఉద్దేశమయితే..అంతకు రెండేళ్లముందు కాలాన్నే అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయివేట్ రంగంలోని కంపెనీలతో కలిసి అమెరికా, చైనాలు పనిచేస్తున్నాయి. అలాగే చంద్రునిపై సౌకర్యాల కల్పన రంగం మంచి బిజినెస్‌గా మారింది.

మనుషులను చంద్రునిపైకి తీసుకెళ్లడానికి, తిరిగి వారిని అక్కడినుంచి తీసుకురావడానికి, అంతరిక్షం తరహాలో చంద్రునిపై కొంతకాలం మనుషులను ఉంచడానికి సాంకేతికతే ప్రధానం. అనేక దేశాలు, ప్రయివేట్ కంపెనీలు చంద్రునిపై వనరులను ఉపయోగించుకునేందుకు, జాబిల్లిని నివాసయోగ్యంగా మార్చే పరిస్థితులు సృష్టించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అవన్నీ అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. పదేళ్ల క్రితమే చైనా అంతరిక్షరంగంలో ప్రయివేట్ కంపెనీలను అనుమతించింది. ఇప్పుడు నాసా చంద్రునిపైకి మరోసారి మనిషిని పంపే ఆర్టెమిస్ ప్రయోగంలో ఎలన్‌మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కీలక పాత్ర పోషిస్తోంది.

చంద్రునిపై ప్రపంచ దేశాలు పోటాపోటీ ప్రయోగాలకు సిద్ధమవడానికి కారణం చంద్రయాన్ 3తో భారత్ సాధించిన గనవిజయమే. చంద్రునిపై సల్ఫర్, అల్యూమినియం, ఇతర మూలకాలు ఉన్నట్టు చంద్రయాన్ 3తో తేలింది. మట్టి, ఖనిజాలను భూమి మీదకు తెచ్చే ప్రయోగాన్నీ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. అలాగే 2026లో జపాన్‌తో కలిసి నిర్వహించే ప్రయోగంలో నీటిజాడలపై కీలక అన్వేషణలు చేయనుంది. అలాగే చంద్రునిపై మెరుగైన పరిస్థితులు ఏర్పడితే.. ఇప్పుడు భూమి కేంద్రంగా జరుగుతున్న అంతరిక్ష పరిశోధనలను జాబిల్లి నుంచి చేయవచ్చు. చంద్రునిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని అంగారకుడిపైకి రాకెట్లు ప్రయోగించవచ్చు. భూమితో పోలిస్తే తక్కువ ఇంధనం ఖర్చుతో ప్రయోగాలు చేయవచ్చు. అలాగే చంద్రునిపై ఎప్పుడూ వెలుతురు ఉండే ప్రాంతం నుంచి సౌరశక్తి ఉత్పత్తి చేసుకోవచ్చు.

మొత్తంగా చందమామపై పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రానున్న రోజుల్లో మన చిన్నారులు జాబిల్లి రావే అని పాడుకునే బదులు.. తామే జాబిల్లిపై నివసించగలరు. చుక్‌ చుక్‌ చుక్ రైలులో చంద్రుణ్ణి చుట్టేయగలరు. మనిషి జీవన పరిణామక్రమం మొత్తం మారిపోయే అవకాశం కనిపిస్తోంది. పరిశోధనల అంతిమలక్ష్యం చందమామగా మారిపోనుంది. చంద్రునిపై జీవించడం, అక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకోవడం సగటు మనిషి కలలా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది.

Read Also : NASA Moon Railway : మూన్‌ రైల్వేకు నాసా బృహత్తర ప్రయత్నం