LPG e-KYC : వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి అలర్ట్.. ఈ పని చేయకపోతే గ్యాస్ బుక్ అవ్వదు.. మార్చి 31 వరకు మాత్రమే ఛాన్స్..!
LPG e-KYC : ఎల్పీజీ వినియోగదారుల కోసం కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ బుకింగ్ కోసం ఈకేవైసీ ప్రక్రియను తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
govt makes Biometric Aadhaar Authentication e KYC mandatory for all domestic LPG consumers
LPG e-KYC : సాధారణంగా వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్ లో పడాలంటే.. ఈ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ బుక్ చేయాలన్నా సరే ఈ-కేవైసీ చేయడం తప్పనిసరి అంటోంది కేంద్రం. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం వల్ల మన దేశంలో గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో కేంద్రం ఎల్పీజీ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించింది. లేదంటే బుకింగ్ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి మార్చి 31 వరకు గడువు విధించింది.
కేంద్రం ఆదేశాల నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులు.. మీసేవ కేంద్రాలు, గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కానీ ఈ ఇబ్బందులేం లేకుండా.. ఇంట్లోనే ఆన్లైన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం వినియోగదారులు.. మీరు వినియోగించే ఎల్పీజీ కంపెనీ మొబైల్ యాప్, Aadhaar FaceRD యాప్ ఉపయోగించి ఇంటి వద్ద నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా తమ LPG డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించవచ్చు.
పశ్చిమ ఆసియా ఘర్షణ కారణంగా మన దేశంలో ఎల్పీజీ కొరత పరిస్థితి నెలకొంది. దీనితో హోటల్ యజమానులు, టిఫిన్ బండ్లు నడుపుకునే వారు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.
పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా హర్మూజ్ జలసంధి దాదాపు మూసివేత స్థితికి చేరుకుంది. భారత్కు దిగుమతి అయ్యే LPGలో సుమారు 90 శాతం ఈ మార్గం ద్వారానే వస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ముందస్తుగా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయడం ప్రారంభించడంతో కొరత ఉందనే భావన ఏర్పడింది.
