Odisha train accident: గాలిలో దీపంలా రైల్వే ప్రయాణికుల భద్రత.. ఒడిశా ప్రమాదంతో వెలుగుచూస్తున్న లోపాలు

ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

CAG report on rail safety : లైఫ్‌లైన్ ది నేషన్.. ఇది మన రైల్వే (Indian Railway) నినాదం.. జాతి జీవనరేఖ అన్న రైల్వే మాట ఎంతవరకు నిజమో కాదో.. కాని మృత్యుగీతికగా మారుతోందని ఒడిశా రైలు ప్రమాదంతో తేలిపోయింది. సిగ్నల్ జంపింగ్‌ (Signal Jumping)తో ప్రమాదానికి గురై వందల మంది ప్రాణాలు కోల్పోడానికి కారణమైన కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ (coromandel express accident) తర్వాత రైల్వే వైఫల్యం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో.. ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారిందా? మన రైల్వే ప్రమాదాలకు కారణమేంటి?

రైల్వే పట్టాలు తప్పుతోందని గతంలో హెచ్చరించిన కాగ్
బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత.. మన రైల్వే లోపాలపై సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేల్లో భద్రతా వైఫల్యం ఎక్కువగా ఉందని గత ఏడాదే కాగ్ హెచ్చరించినా.. ఆ లోపాలను చక్కదిద్దే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు ప్రమాదం జరిగిన బాలాసోర్ మార్గం ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటుంది. రోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ఆ రూట్లో ప్రయాణిస్తుంటారు. తూర్పు-దక్షిణ భారత్‌లను కలిపే ఈ రూట్లో కూడా ఎన్నో లోపాలు వెలుగుచూస్తున్నాయి. మానవ తప్పిదాలు కన్నా.. శాఖాపరమైన నిర్లక్ష్యం.. సాంకేతిక లోపాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గత నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రమాదాలు జరిగిన వెంటనే విచారణ అంటూ హడవుడి చేసే రైల్వే.. ఇంతవరకు జరిపిన విచారణల్లో ఏం తేలిందో ఎప్పుడూ బయటకు చెప్పలేదు. సరికదా విచారణలో వెలుగుచూసిన అంశాలపై జాగ్రత్త పడిన సందర్భాలు కనిపించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాలాసోర్ ప్రమాదం తర్వాత ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వేశాఖను తప్పుబడుతున్నాయి. ప్రతిపక్షాలపై బీజేపీ పెద్దలు ఎదురుదాడి చేస్తున్నారు. మీ హయాంలో ప్రమాదాలు జరగలేదా? అంటూ లెక్కలతో సహా విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో గత ఏడాది కాగ్ విడుదల చేసిన నివేదికలో రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వేలో ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల ఇండియన్ రైల్వే పట్టాలు తప్పుతోందని వ్యాఖ్యానించింది కాగ్. నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. గుర్తించిన లోపాలను సవరించేలా సకాలంలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పింది కాగ్. అంతేకాదు పర్యవేక్షణ లోపం ఎక్కువగా ఉన్నందున సత్వరం ఇంజనీరింగ్ విభాగాన్ని పటిష్టం చేయాలని సూచించింది. కాగ్ నివేదిక ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం మధ్య ప్రతి పది ప్రమాదాల్లో ఏడు రైలు పట్టాల తప్పడం వల్లే జరిగాయని చెప్పింది. అంతేకాదు 2017 నుంచి 2021 మధ్య ట్రాక్ మెయింటెనెన్స్ విషయాన్ని గాలికి వదిలేశారని గుర్తించింది కాగ్. ఆ నాలుగేళ్ల వ్యవధిలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాక్ మెయింటెనెన్స్ జీరో పర్సెంట్‌గా చూపింది.

Also Read: ప్రతి రైలు మార్గంలో ‘కవాచ్’ వ్యవస్థకు డిమాండ్.. పుంజుకుంటున్న ఆ రెండు కంపెనీల షేర్లు

ఇదొక్కటే కాదు.. రైల్వేలో ఎన్నో నిర్వహణాలోపాలను ఎత్తిచూపింది కాగ్. పేలవమైన ట్రాక్ నిర్వహణ, అతివేగం, మెకానికల్ వైఫల్యాలు ఎక్కువగా ఉన్నట్లు తన నివేదికలో తెలిపింది. ట్రాక్‌ రికార్డింగ్ కార్ల తనిఖీల్లో 30 నుంచి వంద శాతం లోపాలు ఉన్నట్లు గుర్తించింది. కాగ్ ఆడిట్ చేపట్టిన నాలుగేళ్ల కాలంలో మొత్తం 422 సార్లు రైలు పట్టాలు తప్పడం వల్ల ప్రమాదాలకు గురైనట్లు గుర్తించింది. ఈ ప్రమాదాల్లో 171 సంఘటనలకు ఇంజనీరింగ్ విభాగం బాధ్యత వహించాలని చెప్పింది. 422 ప్రమాదాల్లో 156 మాత్రమే వాతావరణ మార్పుల వల్ల జరిగిన ప్రమాదాలుగా చెప్పింది. మిగిలిన సంఘటనలు అన్నీ శాఖపరమైన తప్పిదాలేనని ఆందోళన వ్యక్తం చేసింది కాగ్.

కాగ్ నివేదికపై పెద్ద ఎత్తున చర్చ
ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగ్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీకి లేఖరాశారు. తన లేఖలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఖర్గే. కోరమాండల్ ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖర్గే ఆరోపణలు.. డిమాండ్లు రాజకీయంగా చూసినా.. కాగ్ నివేదికపై కేంద్ర ఎలాంటిచర్యలు తీసుకుందనే విషయమై తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది. స్వతంత్ర సంస్థ అయిన కాగ్ నివేదికను బుట్టదాఖలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

11 వందల 29 విచారణ నివేదికలు
16 రైల్వే జోన్లలో రైలు పట్టాలు తప్పిన ప్రమాదాలపై 11 వందల 29 విచారణ నివేదికలు పరిశీలిస్తే… ప్రమాదాలకు 24 కారణాలు గుర్తించింది రైల్వే. లోకో పైలట్‌ కారణంగా జరిగిన ప్రమాదాలకన్నా ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్ వైఫల్యం వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువగా చెబుతున్నారు. సిగ్నల్ పాయింట్‌లను తప్పుగా సెట్ చేయడం, షంటింగ్ ఆపరేషన్‌లలో తప్పుల వల్లే 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని కాగ్ నివేదిక బయటపెట్టింది.

Also Read: ఒడిశా రైలు ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర : బీజేపీ నేత సువేందు అధికారి సంచలన ఆరోపణలు

రైల్వే ప్రమాదాలపై జరిగిన విచారణల్లో 63 శాతం కేసుల్లో నివేదికలు అధికార యంత్రాంగానికి సమర్పించలేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కోచ్‌ల్లో 62 శాతం బోగీల్లో అగ్నిమాపక పరికాలు అందుబాటులో లేవు. సుమారు 27 వేల 770 కోచ్‌ల్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగిన భారీ మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరించింది కాగ్. కాగ్ నివేదికే కాదు రైల్వేలో సీనియర్ అధికారులు సైతం భద్రతా వైఫల్యాలపై గతంలో హెచ్చరించారు. కానీ.. శాఖాపరంగా ఎటువంటి అప్రమత్తత కాని.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంగాని జరగడం లేదు. ప్రమాదాలు తగ్గాయని చెప్పుకుంటూ సమర్థించుకోడానికి ప్రయత్నిస్తున్నారే గాని.. ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తినష్టాలపై పెదవి విప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రైళ్ల వేగానికి తగ్గట్టు పట్టాలు లేవా.. పట్టాల సామర్థ్యంపై ఎన్నో అనుమానాలు.. వివరాలకు ఈ వీడియో చూడండి

ట్రెండింగ్ వార్తలు