Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్.. బీజేపీ వ్యూహమేంటి.. విపక్షాల అభ్యంతరాలేంటి?

కేంద్ర ప్రతిపాదిస్తున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేయడమో లేక కేంద్రమే ముందుగా ఎన్నికలకు రావడమో జరగాల్సివుంది.

what is the bjp strategy on one nation one election

one nation one election: వన్ నేషన్, వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన అంశమిది.. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర సర్కార్ ఆలోచన. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతిపాదన. ఈ ఆలోచన ఇప్పటిదికాదు.. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ దిశగా కసరత్తు చేస్తోంది. 2016లో ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. లా కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏకకాల ఎన్నికలకు సానుకూలంగా స్పందించాయి. కానీ, ప్రతిపక్షాలు కేంద్రం ఆలోచనను తోసిపుచ్చుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వద్దే వద్దు అంటున్నాయి.. ఎవరు ఏమనుకున్నా కేంద్రం మాత్రం జమిలి ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది? మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ నియమించింది.. పార్లమెంట్ ఎన్నికల ముందు తెరపైకి వచ్చిన ఏకకాల ఎన్నికలు సాధ్యమా? బీజేపీ వ్యూహమేంటి? విపక్షాల అభ్యంతరాలేంటి?

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అధికార, ప్రతిపక్ష కూటములు రెండూ సార్వత్రిక సమరానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశమైన జమిలి ఎన్నికలకు 2016 నుంచి ప్రధాని మోదీ ప్రతిపాదిస్తున్నప్పటికీ ఎట్టకేలకు కీలక అడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. అమృత్‌కాల్ సమావేశాలంటూ పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహూర్తం ఫిక్స్ చేసిన ఒక రోజు తర్వాత ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది ప్రభుత్వం.

ప్రతి ఐదేళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించడం మన రాజ్యాంగ విధానం. అలా అని రెండింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనేమీ లేదు. కానీ.. వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతుండటం.. ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు ఉంటుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా పరిపాలన పరమైన ఆటంకాలు ఎక్కువగా ఉంటుండటం వల్ల ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తేలేకపోతున్నామని భావిస్తోంది. అందుకే ఐదేళ్ల పదవీకాలానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది.

మన రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన లేకపోయినా.. 1967 వరకు జమిలి ఎన్నికలే జరిగేవి. 1968, 69ల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం.. 1970లో ఏడాదికి ముందే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాల్సిరావడంతో.. అంతవరకు కొనసాగిన ఆనవాయితీకి ఫుల్‌స్టాప్ పడింది. కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరుగా ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐతే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఏకకాల ఎన్నికల విధానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఐతే అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా, 1999లో లా కమిషన్ కూడా జమిలికి జైకొడుతూ ఓ నివేదిక సమర్పించింది. ఐతే ఎప్పుడూ చర్చలకే పరిమితమైన జమిలి ఎన్నికల విధానం.. కేంద్రం తాజా నిర్ణయంతో ఓ అడుగు ముందుకు వేసినట్లైంది.

కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయ, ఆర్థిక కోణాల్లో అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే కేంద్రం ఈ ప్రతిపాదన తెరపైకి తెస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ప్రజాధనం, పరిపాలన అంటూ భిన్న వాదనలు వినిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నిజానికి వేర్వేరు సందర్భాల్లో ఎన్నికలు జరుగుతుండటం వల్ల పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాధనం వృథా అవుతోంది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఆర్నెల్లకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఎన్నికల నియామావళి అమలుల్లోకి వస్తుండటంతో పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటోంది కేంద్రం.

Also Read: ముంబై సమావేశంలో పెద్ద డ్రామా.. ఒక్కసారిగా ప్రత్యక్షమైన కపిల్ సిబాల్, కస్సుబుస్సన్న కాంగ్రెస్ నేతలు

ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని స్వేచ్ఛగా ఏ విధానం అమలు చేయలేకపోతున్నామంటోంది. మరీ ముఖ్యంగా కేంద్రానికి ఒకసారి.. రాష్ట్రాలకు మరోసారి ఎన్నికలు జరుగుతుండటం వల్ల డబ్బు కూడా వృథా అవుతోందని అంటోంది. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఐతే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా పది వేల కోట్లు కాగా, ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం 250 నుంచి 500 కోట్ల రూపాయాలు వెచ్చించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Also Read: ఇండియా కూటమి 2024 ఎన్నికల వ్యూహం ఇదే.. ఈ 5 కమిటీలతో బీజేపీని కొట్టాలని ప్లాన్

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పళంగా ఎన్నికలకు వెళ్లాలన్నా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రంతోపాటు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలన్నా రాజ్యాంగ సవరణ చేయాల్సివుంటుంది. మరీముఖ్యంగా మొత్తం ఎన్నికల విధానాన్నే సంస్కరించాల్సి వుంటుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమైనా ఏదైన కారణంతో రద్దైతే.. ఒక్క ఆ ప్రభుత్వానికే ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికల విధానంలో ఈ చాన్స్ పూర్తిగా తగ్గిపోనుంది. దీనికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఎలాంటి సూచనలు చేస్తోందో చూడాల్సివుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడికి షాక్.. ఎంపీకి అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు

సార్వత్రిక ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగా తెలంగాణతోసహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రతిపాదిస్తున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేయడమో లేక కేంద్రమే ముందుగా ఎన్నికలకు రావడమో జరగాల్సివుంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ బలం ఉంది. ఐతే రాజ్యాంగ సవరణకు కావాల్సిన బలానికి కాస్త తక్కువ. 543 స్థానాల్లో కనీసం 67శాతం అనుకూలంగా ఓటువేయాలి. రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం సభ్యులు సమర్థించాలి. లోక్‌సభలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు లోక్‌సభలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61శాతానికి సమానం. మరో 5శాతం ఓటింగ్‌ను సంపాదించడం దానికి కష్టమే. రాజ్యసభలో కేవలం 38శాతం మాత్రమే సీట్లు ఉన్నాయి.

Also Read: బీజేపీ వాళ్లు దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తారట.. సిగ్గుండాలి: ఏపీసీసీ ఆగ్రహం

ఏదైనా సరే బీజేపీ తలుచుకుంటే లోక్‌సభలో బిల్లు పాస్ అవ్వడం పెద్ద పనేమీ కాదు. కానీ రాజ్యసభ ఆమోదం పొందడమే కష్టం. ఇక విపక్షాలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తాయా లేదా? అన్నదే ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే జాతీయస్థాయి పార్టీలుగా ఉన్నాయి. సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ, సమాజ్‌వాది, ఆప్ వంటి జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ అవి ఏవో ఒక రాష్ట్రానికి పరిమితం అవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో రెండు జాతీయ పార్టీలకన్నా బలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు ఏవీ సముఖంగా లేవు. ఈ పరిస్థితుల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కానీ 2014లో బీజేపీ తెరపైకి తెచ్చిన ప్రతిపాదన తొలి అడుగు మాత్రం పడింది. వచ్చేఎన్నికల్లో అధికారం చేపట్టే పార్టీయే ఈ ప్రతిపాదనకు తుదిరూపు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు