Eatala Rajender : కుంగిన మేడిగడ్డ బ్యారేజీ.. కారణం ఏంటో చెప్పిన ఈటల రాజేందర్, ఇంకా ఎన్ని పిల్లర్లు ధ్వంసమయ్యాయో అని ఆందోళన

ప్రాజెక్ట్ డ్యామ్ కుంగితే కట్టి ఏం లాభం? మేడిగడ్డ డ్యామేజ్ పై పూర్తి వివరాలు ప్రజలకు చెప్పాలి. ఒక పిల్లర్ 5 ఫీట్లు సింక్ అయిందని చెబుతున్నారు. Eatala Rajender

Eatala Rajender Criticise CM KCR (Photo : Facebook, Google)

Eatala Rajender Criticise CM KCR : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన పెద్ద శబ్దంతో కుంగడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై దుమారం రేగింది. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా అధికార పార్టీని టార్గెట్ చేశాయి. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏం చెబుతారు? అని నిలదీస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ పై ఆయన ఫైర్ అయ్యారు. నేనే ఇంజినీర్ లాగా పని చేశానని కేసీఆర్ చెప్పే వారు, మరిప్పుడు ఏమైంది? అని విమర్శించారు.

”కాళేశ్వరం కడితే తెలంగాణ రైతులకు నీల్లోస్తాయని సంబరపడ్డాం. నేనే ఇంజినీర్ లాగా పని చేశానని కేసీఆర్ చెప్పే వారు. గతంలో వచ్చిన వరదలకు మోటర్లు మునిగాయి. కాంక్రీట్ గోడలు కూలి భారీ నష్టం కలిగింది. అప్పుడే కాళేశ్వరం గొప్పతనం బయటపడింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే నిపుణుల సలహాలు, డిజైన్ లు తీసుకోవాలి. అవి పాటించకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది.

Also Read : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ప్రమాదంపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ప్రాజెక్ట్ డ్యామ్ కుంగితే కట్టి ఏం లాభం? మేడిగడ్డ డ్యామేజ్ పై పూర్తి వివరాలు ప్రజలకు చెప్పాలి. ఒక పిల్లర్ 5 ఫీట్లు సింక్ అయిందని చెబుతున్నారు. ఇంకా ఎన్ని పిల్లర్లు ధ్వంసమయ్యాయో తెలీదు. దీనికి బాధ్యులు ఎవరో కేసీఆర్ చెప్పాలి? పోలీసులను అడ్డు పెట్టినంత మాత్రాన నిజాలు దాగవు. కేంద్ర ఏజెన్సీలు ప్రాజెక్టును సందర్శించి విచారణ జరపాలి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఇంజినీర్ల డిజైన్ మేరకు బ్యారేజీ నిర్మాణం-L&T
మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై ఎల్ అండ్ టీ కంపెనీ ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 2019లో ఎల్ అండ్ టీ 1.632 కిలోమీటర్ల పొడవైన లక్ష్మీ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపింది. అప్పటి నుంచి బ్యారేజీ పని చేస్తోందని, ఇటీవల 2023 సీజన్ తో సహా గత 5 వరద సీజన్స్ ను బ్యారేజీ తట్టుకుందని తెలిపింది. గతేడాది బ్యారేజీకి 28లక్షల 25వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ ఉంటే అత్యధికంగా 28.70 లక్షల వరద నమోదైందని తెలిపింది. బ్యారేజీ రూపకల్పన పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్ల డిజైన్ మేరకు చేపట్టామని స్పష్టం చేసింది.

జూలై 2022లో సంభవించిన భారీ వరదల్లో కూడా బ్యారేజీ సురక్షితంగా తట్టుకుందని ఎల్ అండ్ టీ ప్రకటన చేసింది. నిన్న సాయంత్రం బ్యారేజీలోని బ్లాక్ 7లోని ఒక ప్రదేశంలో పెద్ద శబ్దం వచ్చిందని, బ్లాక్ 7లోని వంతెన భాగం కుంగిపోయిందని తెలిపింది. జరిగిన నష్టాన్ని రాష్ట్ర అధికారులతో చర్చించామని, ఇప్పటికే తమ సాంకేతిక నిపుణుల బృందాన్ని ప్రాజెక్ట్ సైట్ కు పంపించినట్లు తెలిపింది. నష్టాలను సాంకేతికంగా అంచనా వేస్తామని, సాధ్యమైనంత త్వరగా నష్టాన్ని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఎల్ అండ్ టీ సంస్థ.

పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన..
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన పెద్ద శబ్దంతో కుంగింది. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్టు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజీ వంతెన మీదుగా వాహనరాకపోకలను నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు.

Also Read : సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనం

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించారు లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ మెుత్తం పొడవు 1.6 కిలోమీటర్లు కాగా..ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.

గోదావరి నదిపై 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీని నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది కావటం విశేషం. ఈ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు.

రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. పిల్లర్లు కుంగటానికి కారణలు తెలుసుకునే పనిలో పడ్డారు ఇంజినీర్లు.

ట్రెండింగ్ వార్తలు