Telangana BJP – JanaSena : మద్దతు ఇవ్వండి.. పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ.. పవన్ ఏం చెప్పారంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

KishanReddy meets PawanKalyan

BJP Telangana – JanaSena Party : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ మద్దతుతో  ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలకు స్నేహసంబంధాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల్లోనూ జనసేన మద్దతుతో పోటీకి వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ ను వారు కోరారు. అయితే, పవన్ కల్యాణ్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

Read Also : యోగి వస్తున్నారు..! ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు.. కేసీఆర్ పై పోటీగురించి విజయశాంతి సంచలన ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. పార్టీ తెలంగాణ శాఖ ఇప్పటికే 32 చోట్ల పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితానుసైతం వెల్లడించింది. అయితే, మంగళవారం తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఈ దఫా ఖచ్చితంగా ఎన్నికల బరిలో నిలవాలని, లేకుంటే రాబోయే కాలంలో పార్టీ ఎదుగుదలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలంగాణ జనసేన నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కల్యాణ్ సైతం వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఇప్పటికే జనసేన ప్రకటించిన నియోజకవర్గాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Read Also : అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!

జనసేన అధినేత పవన్ తో భేటీ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు. అయితే, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయానికి వస్తే జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతల అభ్యర్ధన మేరకు పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపైనా అందరిలో ఆసక్తి నెలకొంది. బీజేపీకి మద్దతు ఇస్తారా? లేకుంటే పొత్తుతో రెండు పార్టీలు సీట్లు పంచుకొని ఎన్నికల బరిలోకి దిగుతాయా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

మరోవైపు ఏపీలో టీడీపీతో కలిసి వెళ్తామని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ తెలంగాణలోనూ టీడీపీ, జనసేన కలిసి వెళ్తుందా? లేకుంటే టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా? అనే ఆసక్తికర చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు