Jagga Reddy – Raghunandan: జగ్గారెడ్డి, రఘునందన్‌రావు మౌనం.. అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం

Jagga Reddy, Raghunandan Rao Silence

Jagga Reddy- Raghunandan Rao: ఆ ఇద్దరు రెండు ప్రధాన పార్టీల్లో ముఖ్య నేతలు.. ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించే ఫైర్‌బ్రాండ్‌ లీడర్లు.. వారు మాట్లాడితే చాలు స్వపక్షంలోనైనా.. విపక్షంలోనైనా ప్రత్యర్థులు సైలెంట్‌ అయిపోవాల్సిందే.. అలాంటి వారే ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. మాటల్లేవ్‌ అంటూ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ సొంత నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? సీఎం సొంత జిల్లా మెదక్‌ (Medak) లో తెరవెనుక జరుగుతున్న రాజకీయం ఏంటి?

ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నేతలుగా గుర్తింపు పొందారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy), దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao). సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్‌లో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్, బీజేపీల్లో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ మధ్య ఈ ఇద్దరు నేతలు కాస్త సైలెంట్ అయ్యారు. బీజేపీలో ప్రముఖ నేతగా ఎదిగిన రఘునందన్ ఏ వేదికపైనేనా.. సమర్థంగా వాడుకుని బీఆర్ఎస్‌ని చీల్చి చెండాడుతుంటారు. ఆయన వాగ్దాటితో జనానికి బాగా కనెక్ట్ అయింది బీజేపీ. కానీ.. ఈ మధ్య రఘునందన్ ఉలుకూ పలుకూ లేకుండా మౌనవ్రతం పాటిస్తున్నట్లు ఎక్కడా కనిపించడంలేదు. ఇదేమని ఆరా తీస్తే.. రఘునందన్ బీజేపీ జాతీయ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా మంది నేతలకు బీజేపీ పదవులు ఇచ్చినా రఘునందన్‌ను పక్కక పెట్టింది కమలం పార్టీ. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందనే తాజాగా ప్రచారం జరుగుతోంది.

Also Read: ఆశావహులు, అసమ్మతి నేతలు జారిపోకుండా కేసీఆర్ కొత్త వ్యూహం.. జంప్ జిలానీలకు చెక్!

ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా.. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా స్వపక్షాన్ని టార్గెట్ చేసే జగ్గారెడ్డి కూడా ఈ మధ్య ఎక్కడా మాట్లాడటం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పుడు ఈయన సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో పార్టీ వేవ్ గమనించిన జగ్గారెడ్డి తన మాటలను బాగా తగ్గించారు. ఫలితాల అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే జగ్గారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి శకం నడుస్తోంది. దీంతో తన మాట చెల్లుబాటు కాదనే ఉద్దేశంతో జగ్గారెడ్డి సైలెంట్ అయినట్లు భావిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో కేసీఆర్‌పై జగ్గారెడ్డికి సానుకూల వైఖరి పెరిగిందని.. ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు మరో టాక్ నడుస్తోంది.

Also Read: మంత్రి హరీష్‌రావును కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మార్పు విషయంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే

ఇలా ఇద్దరు నేతలు సైలెంట్‌గా ఉండటం వెనుక పార్టీ మారే ఉద్దేశం ఉందనే ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ఇందులో ఎంత నిజం ఉందోగాని ఆ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటుండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Also Read: కమలం పార్టీకి మరో కొత్త చిక్కు.. నెత్తి నొప్పి తెచ్చిన నేతల భద్రత

ట్రెండింగ్ వార్తలు