కేసీఆర్‌ అసెంబ్లీకి వెళ్తారా, లేదా? బీఆర్ఎస్‌కు జూలై 24 టెన్షన్..! కాంగ్రెస్ వ్యూహం ఏంటి..

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్‌... ఒక్కరినీ కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తున్నాయి.

Gossip Garage : టార్గెట్‌ 26… డేట్‌ 24.. తెలంగాణలో ఈ రెండు నెంబర్ల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 24వ తేదీలోగా 26 టార్గెట్‌ను చేరుకోవాలని కాంగ్రెస్‌…. అధికార పార్టీని అడ్డుకుని పార్టీని రక్షించుకోడానికి బీఆర్‌ఎస్‌…. పోటాపోటీగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటంలా అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఈ పొలిటికల్‌ వార్‌…. ఈ వారం రోజుల్లో పీక్స్‌కు చేరుకుంటుందా?

జూలై 24.. డైడ్‌లైన్‌గా పెట్టుకున్న కాంగ్రెస్..
అటు కాంగ్రెస్‌… ఇటు బీఆర్‌ఎస్‌…. మధ్యలో ఎమ్మెల్యేలు… తెలంగాణ పొలిటికల్‌ స్ర్కీన్‌పై టగ్‌ ఆఫ్‌ వార్‌ పొలిటికల్‌ సీన్‌ ఆసక్తిరేపుతోంది. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం విలీనమే టార్గెట్‌గా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ… తన టార్గెట్‌ను చేరుకోడానికి డెడ్‌లైన్‌గా ఈ నెల 24ను ఎంచుకుందని తాజా సమాచారం. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అలర్ట్‌ అయింది. ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతున్న పరిస్థితుల్లో శాసనసభాపక్షం విలీనమయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో… మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది. జులై 24 టెన్షన్‌తో బీఆర్‌ఎస్‌ హైఅలర్ట్‌లో ఉందంటున్నారు.

ఆలోగా బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్‌..
ఈ నెల 24న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని టార్గెట్‌ పెట్టుకుంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో… వరుసగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు‌. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించినా… గత నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వలసలు జోరందుకున్నాయి. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కి బైబై చెప్పేసి… అధికార పార్టీతో చేతులు కలిపారు.

వీరిపై అనర్హత వేటు వేయించాలని బీఆర్‌ఎస్‌… తమ పార్టీలో చేరిన వారు అనర్హతకు గురికాకుండా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నాయి. గత పదేళ్లలో రెండు సార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని కాంగ్రెస్‌, టీడీపీ శాసనసభా పక్షం విలీనమైనట్లు ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్‌. ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్‌ పెద్దలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు.

ఆ 16 మందిని కాపాడుకోడానికి బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు..
కాంగ్రెస్‌ టార్గెట్‌ చేరుకోడానికి సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గత వారం గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోగా, మరికొందరు ఈ లిస్టులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌ శాసనసభాపక్షం విలీనం కావాలంటే 2/3వ వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరాల్సివుంది. అంటే 38 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో 26 మంది ఆ పార్టీని వీడాల్సి వుంటుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో ఇంకా 16 మందిపై ఫోకస్‌ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఐతే ఈ 16 మందిని కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది బీఆర్‌ఎస్‌.

జూలై 24న ఏం జరగనుంది?
ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్‌… ఒక్కరినీ కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎంతలా ప్రయత్నించినా.. రోజుకో ఎమ్మెల్యే కారు దిగేస్తుండటంతో జులై 24లోగా ఏం జరుగుతుందనే ఆసక్తి ఎక్కువవుతోంది.

కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? లేదా?
మరోవైపు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుపైనా ఉత్కంఠ ఏర్పడుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌… ఆ తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌కు హాజరుకాలేదు. ఇప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోడానికైనా మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అడుగుపెడతారా? లేదా.. ఫామ్‌ హౌస్‌కే పరిమితమవుతారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి జులై 24 టెన్షన్‌ బీఆర్‌ఎస్‌లో వణుకు పుట్టిస్తుండగా, కాంగ్రెస్‌ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రక్తికడుతోంది.

Also Read : ఎన్నడూ లేని విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్..! ముఖ్యమంత్రిలో మార్పునకు కారణమేంటి?

 

ట్రెండింగ్ వార్తలు