Cyber Crime: మాజీ ఐపీఎస్ భార్యకే టోకరా.. రూ. 2కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా
ఆ తర్వాత డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేయడం ప్రారంభించింది. అలా డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీలు చేసింది. మొత్తం 2.58 కోట్లు పంపింది.
Cyber Crime Representative Image (Image Credit To Original Source)
- 500 శాతం లాభాల పేరుతో ఘరానా మోసం
- వాట్సాప్ లో సెబీ నకిలీ సర్టిఫికెట్లు
- పలు దఫాలుగా రూ.2.58 కోట్లు పంపిన మాజీ ఐపీఎస్ భార్య
Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చదువు రాని వారిని, అమాయకులనే కాదు.. బాగా చదువుకున్న వారిని కూడా ఇట్టే మోసం చేస్తున్నారు. ఏ మాత్రం డౌట్ రాకుండా పని కానిస్తున్నారు. మాయ మాటలతో నమ్మించి కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి భార్యకే సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఏకంగా 2 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ క్రిమినల్స్ చేతిలో మాజీ ఐపీఎస్ భార్య మోసపోయిన వైనం హైదరాబాద్ లో వెలుగుచూసింది.
ఇది ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ కేసు. మాజీ ఐపీఎస్ అధికారి భార్య రూ.2.58 కోట్లు మోసపోయింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామని వాట్సాప్ నుంచి ఆమెకు సందేశం వచ్చింది. అయితే, దాని గురించి ఆమెకు అవగాహన లేదు. దాంతో ఆమె తన భర్తను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయించింది. ఇక సైబర్ నేరగాళ్లు తమ పని మొదలు పెట్టారు. 500 శాతం లాభాలు వస్తాయని ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించారు. ఒక లింక్ పంపిన సైబర్ మోసగాళ్లు.. సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అని ఆమెను నమ్మించారు. వాట్సాప్ లో సెబీ నకిలీ సర్టిఫికెట్లు కూడా పంపారు. అది చూసి ఆమె పూర్తిగా నమ్మేసింది. 500శాతం లాభాలు అనగానే టెంప్ట్ అయ్యింది.
ఆ తర్వాత డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేయడం ప్రారంభించింది. అలా డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీలు చేసింది. మొత్తం 2.58 కోట్లు పంపింది. ఆ తర్వాత డబ్బులు పంపడం ఆపేసింది. అయితే, మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని సైబర్ క్రిమినల్స్ ఆమెపై ఒత్తిడి పెంచారు. ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే ఇప్పటివరకు పెట్టిన డబ్బు పోతుందని భయపెట్టారు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబోమంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, సైబర్ క్రైమ్స్ గురించి పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. లాభాల పేరుతో జరిగే మోసాల గురించి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని చెబుతూనే ఉన్నారు. అయినా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. అత్యాశతో, అమాయకత్వంతో అడ్డంగా మోసపోతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు.
Also Read: ఫోటోలు కాల్చి సిగరెట్లు తాగుతున్న అమ్మాయిలు.. ఎందుకిలా? వీడియోలు వైరల్
