Special Trains : సంక్రాంతి పండుగ వేళ.. హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు.. తేదీలు ఇవే .. రిజర్వేషన్ లేకపోయినా వెళ్లొచ్చు..
Special Trains : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ - విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
Sankranti Special Trains
- సంక్రాంతి పండుగవేళ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
- హైదరాబాద్ – విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు
- తేదీలను వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains : సంక్రాంతి పండుగ వేళ నగర వాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నగరంలోని ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్తుండగా.. కొందరు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే నగర వాసులు రైల్వేను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ రైళ్లకు సంబంధించిన తేదీలనుసైతం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు పండుగకు ముందు, పండుగ తరువాత రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ప్రత్యేక రైళ్ల తేదీలు ఇలా..
హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈనెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10గంటలకు రాకపోకలు సాగిస్తాయి. అదేవిధంగా ఈనెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికిపైగా జనరల్ బోగీలు ఏర్పాటు చేశారు.
