అశ్వరావుపేట మండలంలో పోటెత్తిన వరద.. బ్రిడ్జిపై చిక్కుకున్న కూలీలు, కాపాడాలంటూ ఆర్తనాదాలు

చీకటిపడి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. వారిని కాపాడటానికి ఎయిర్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి.

Heavy Inflow In Peddavagu Project : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో వరద పోటెత్తింది. నారాయణపురం బ్రిడ్జిపై పలువురు చిక్కుకున్నారు. చీకటి పడిపోయి వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లను వినియోగించడానికి వీలు లేకుండా ఉంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి. బ్రిడ్జిపై చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అశ్వరావుపేట మండలం కట్టమైసమ్మ ఆలయం వద్ద వరదలో చిక్కుకున్న 31 మందిని రెండు హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. మేకలబండ సమీపంలో బ్రిడ్జిపై మరో 9 మంది చిక్కుకుపోయారు. చీకటిపడి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. వారిని కాపాడటానికి ఎయిర్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి. 9మందిని సురక్షితంగా బచ్చువారి గూడెం తరలించారు. ఇప్పటివరకు వరదలో చిక్కుకున్న 41 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు.

మరోవైపు పెదవాగు ప్రాజెక్టుకు ప్రమాదకరంగా 69 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ కట్ట ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు కట్ట తెగినట్లయితే ఆంధ్రాలోని వేలేరుపాడు మండలంలో కమ్మరి గూడెం, వసంత వాడ సహా 5 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందన్నారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దగ్గరుండి సమీక్షిస్తున్నారు.

పెదవాగు ప్రాజెక్టు కట్టపై నుండి వరదనీరు పొంగుతుండటంతో లోతట్టు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెదవాగు ప్రాజెక్ట్ కట్టలు తెగి వరదనీరు పొంగటంతో.. గుమ్మడవల్లి, కొత్తూరు, కోయరంగాపురం, బచ్చువారి గూడెం గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

Also Read : భారీ వర్షాలతో గోదావరి జిల్లాలు అతలాకుతలం.. వాగులో కొట్టుకుపోయి కారు

ట్రెండింగ్ వార్తలు