భారీ వర్షాలతో గోదావరి జిల్లాలు అతలాకుతలం.. వాగులో కొట్టుకుపోయి కారు

ఉత్తర బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.

భారీ వర్షాలతో గోదావరి జిల్లాలు అతలాకుతలం.. వాగులో కొట్టుకుపోయి కారు

వాగులో కొట్టుకుపోయిన కారు నుంచి బయటపడిన రుద్రంకోట వాసులు

Heavy Rains: ఉత్తర బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యారు. ఏలూరు జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వాగులో కొట్టుకుపోయిన కారు..
వేలేరుపాడు మండలం కోయమాధారం- విప్పలగుంపు గ్రామాల మధ్యలో వాగు పొంగడంతో వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. రుద్రంకోటకు చెందిన డ్రైవర్ తో పాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో ఉన్నారు. రాజమండ్రి నుంచి రుద్రంకోటకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెవెన్యూ, పోలీసుల యంత్రాంగం సకాలంలో స్పందించి వారిని కాపాడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

వరదనీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
ఏలూరు జిల్లా బుట్టాయిగుడెం వద్ద వరదనీటిలో చిక్కుకున్నఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను స్థానికులు రక్షించారు. స్కూల్ ముగిశాక విద్యార్థులను ఇళ్ల వద్ద దింపేందుకు వెళ్తున్న స్కూల్ బస్సు రహదారిపై ఉధృతంగా ఉన్న వరద నీటి ప్రవాహంలో చిక్కుకుని మధ్యలో నిలిచిపోయింది. ట్రాక్టర్ సహాయంతో బస్సును ఒడ్డుకు చేర్చి విద్యార్థులను గ్రామస్తులు కాపాడారు.

వందల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షంతో గుండేటివాగు, ఎద్దువాగు గుండేటివాగు పొంగి ప్రవహిస్తున్నాయి. పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వందల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.

Also Read: ఎర్రమట్టి దిబ్బలు జాతీయ వారసత్వ సంపద, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది- అమర్నాథ్

ఏజెన్సీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి కామయ్యపాలెం వెళ్లే రహదారి మధ్యలో అశ్వరావుపేట వాగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా డైవర్షన్ వేసిన రహదారిపై జల్లేరువాగు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు 19 ఏజెన్సీ గ్రామాలకు నిలిచిపోయాయి. ఇప్పలపాడు, కన్నాపురం రహదారులపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు వాగులు దాటువద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు.. నెల రోజుల్లోనే ఎందుకింత మార్పు?

పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
ఏలూరు ఎగువ కురుస్తున్న వర్షాలకు తోడు కొండ వాగులు పొంగడంతో పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. ఎగువ స్పిల్వే దగ్గర నీటిమట్టం 28.080 మీటర్లు, దిగువ స్పిల్ వే దగ్గర 18.230 మీటర్లు నమోదయింది. ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర 28.230 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్ దగ్గర 17.570 మీటర్లుగా నమోదయింది.