నిన్న లక్షలు, నేడు కోట్లు…! పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు.. నెల రోజుల్లోనే ఎందుకింత మార్పు? కారణం ఏంటి?

ఇంతకు ముందు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఎకరం భూమి అమ్మాల్సి వచ్చేదని... ఇప్పుడు సగం భూమి అమ్మినా గ్రాండ్‌గా పెళ్లి చేసేయొచ్చని సంబరపడుతున్నారు పిఠాపురం వాసులు.

నిన్న లక్షలు, నేడు కోట్లు…! పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు.. నెల రోజుల్లోనే ఎందుకింత మార్పు? కారణం ఏంటి?

Gossip Garage : ఆ నియోజకవర్గం రాష్ట్ర రాజధానికి దగ్గర లేదు.. రాష్ట్రంలో ప్రధాన నగరాలకు సమీపంలో కూడా లేదు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కాదు. ఏవో అంతర్జాతీయ సంస్థలు వస్తాయనే ప్రచారమూ లేదు. పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద ఏపీ. ఆ నియోజకవర్గంలో భూములకు ఒక్కసారి గిరాకీ పెరిగింది. ఎన్నికల ముందు వరకు ఉన్న ధరలు ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయాయి. ఎక్కడెక్కడి వారో అక్కడ భూముల కోసం ఎగబడుతున్నారు… ఇంతలా ఆ నియోజకవర్గంలో భూములకు డిమాండ్‌ ఎందుకు ఏర్పడింది? ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది…

నెల రోజులుగా రియల్ భూమ్.. చుక్కలను తాకుతున్న భూముల ధరలు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో పరిస్థితులు మారుతున్నాయా? గత ఐదేళ్లు నత్తనడకన సాగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయా….? ఈ విషయాలు తెలుసుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గంపై ఓ లుక్కేయాల్సిందే… రాష్ట్రంలో రియల్‌ వ్యాపారం ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే, పిఠాపురంలో మాత్రం భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల రోజుల నుంచి పిఠాపురంలో రియల్‌ భూమ్‌తో పంట పొలాల ధరలు ఒక్కసారిగా రెండింతలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంపై రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్‌ ఉండటం…. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తారనే అంచనాలతో ఈ నియోజకవర్గంలో భూములపై పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు.

రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన భూముల ధరలు..
గత నెల రోజులుగా పిఠాపురంలో భూ వ్యవహారాలను గమనిస్తే ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలుస్తున్నాయి. ఒకప్పుడు 50 నుంచి 60 లక్షల రూపాయల ఉండే భూములు ధరలు ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. ఇలా ఒకేసారి ధరలు పెరగడానికి కారణం డిప్యూటీ సీఎం పవన్‌ కారణమని విశ్లేషిస్తున్నారు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు. గతంలో తమ ప్రాంతంలో ఈ స్థాయిలో రియల్‌ వ్యాపారం జరిగేది కాదని… పవన్‌ గెలిచిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సైతం భూముల కోసం తమకు ఫోన్లు చేస్తున్నారని చెబుతున్నారు.

పిఠాపురంలో భూములున్న వారి పంట పండుతోంది..
గత నెల రోజులుగా మారిన పరిస్థితులతో పిఠాపురంలో భూములు ఉన్నవారి పంట పండుతోంది. రోజు రోజుకు ధరలు పెరిగిపోవడంతో అమ్ముదామని అనుకున్నవారు సైతం కొద్ది రోజులు వేచిచూద్దామనే ఆలోచనకు వచ్చేస్తున్నారు… ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో సొంత ఇల్లు, పార్టీ ఆఫీసు నిర్మాణానికి 3.52 ఎకరాలు భూమి కొన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీసు, ఆ పక్కనే తన సొంత ఇల్లు నిర్మిస్తానని ప్రకటించారు. ఇక ఆ మరునాడు నుంచి పవన్‌ భూమికొన్న పరిసరాల్లో స్థలాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో తరలివస్తున్న రియల్‌ వ్యాపారులు… బేరాలు కూడా లేకుండా రైతులు చెప్పిన ధరకు అగ్రిమెంట్లు చేసుకుంటామని ఆఫర్లు ఇస్తున్నారు…

ఎకరం ధర రూ.2 కోట్లు..
తాజా రియల్‌ భూమ్‌తో పిఠాపురం టౌన్‌లో రోడ్డు పక్కన ఎకరం 2 కోట్లు పలుకుతోంది. ఇంతకుముందు వరకు 50 లక్షల నుంచి కోటి 25 లక్షల రూపాయల మధ్య ఉండే ధర అమాంతంగా పెరగడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఎకరం భూమి అమ్మాల్సి వచ్చేదని… ఇప్పుడు సగం భూమి అమ్మినా గ్రాండ్‌గా పెళ్లి చేసేయొచ్చని సంబరపడుతున్నారు పిఠాపురం వాసులు. పవన్‌ నాయకత్వంపై నమ్మకం వల్ల భవిష్యత్‌లో పిఠాపురం అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఆలోచనే ఈ రియల్‌ భూమ్‌కి కారణంగా చెబుతున్నారు. ఒక్కసారిగా ఏర్పడిన డిమాండ్‌తో పిఠాపురం నుంచి చేబ్రోలు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా కొందామంటే భూములు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి పవన్‌ నాయకత్వంపై నమ్మకంతో పిఠాపురంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుండటమే హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read : కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్.. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని..