Shiv Pratap Shukla : తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. ఎవరీయన?.. ఫుల్ బయోడేటా ఇదే..
shiv pratap shukla : కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ క్రమంలో తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం అయ్యారు.
shiv pratap shukla
- తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా
- జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ
- రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన
- శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం
shiv pratap shukla : కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొందరిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల నియామకం, బదిలీపై గురువారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు.
పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీలు..
గవర్నర్ల బదిలీల్లో భాగంగా తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంకు.. తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు.. హిమాచల్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా తరుణ్ జిత్ సంధూను నియమించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. నందకిశోర్ యాదవ్ నాగాలాండ్, సయ్యెద్ అటా హస్సైన్ బీహార్ గవర్నర్ గా నియామకం అయ్యారు.
శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం..
తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1952 ఏప్రిల్ 1న యూపీలోని గోరఖ్‌పూర్‌లో జన్మించిన ఆయన.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) పట్టా పొందారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదుగుతూ.. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా, రాష్ట్రాల గవర్నర్ స్థాయికి ఎదిగారు.
మోదీ కేబినెట్లోనూ..
తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా 1989లో తొలిసారి గోరఖ్‌పూర్ నుంచి ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆ తరువాత 1991, 1993, 1996లలోనూ వరుసగా విజయాలు సాధించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తాల కేబినెట్లలో జైళ్లు, గ్రామాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లోనూ పనిచేశారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా శివ ప్రతాప్ శుక్లా కొనసాగారు. వివాద రహితుడిగా ఆయనకు పేరుంది. 2023 ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్ 29వ గవర్నర్ గా కేంద్రం ఆయన్ను నియమించింది. తాజాగా తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను నియమిస్తూ రాష్ట్ర ప్రతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
