ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి.. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య..

Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జూలై 22వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అదే రోజు సీబీఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జిషీట్ పై విచారణ జరగబోతోంది. అలాగే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన కూడా జూలై 22నే విచారణ జరగబోతోంది.

ఇవాళ(జూలై 18) జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, వైద్య పరీక్షల ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు కవిత. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో కవితకు చికిత్స అందించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

కవితకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఆ నివేదికను సమర్పించాలని తీహార్ జైలు అధికారులకు స్పష్టం చేశారు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి. ఇటీవల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె హైఫీవర్, నీరసంతో బాధపడ్డారు. కళ్లు తిరిగి కిందకు పడిపోవడంతో కవితను ఆసుపత్రికి తరలించి ఒక పూట చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం కవితను మళ్లీ తీహార్ జైలుకి తరలించారు. ఈరోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం కవిత తరుపు న్యాయవాది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు జరపాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

కవిత సీబీఐ కేసుకి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ జూలై 22న జరగబోతోంది. జూలై 7న సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని, బెయిల్ కు కవిత అర్హురాలని ఆమె తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. అయితే చార్జ్ షీట్ లో ఎటువంటి తప్పులు లేవని సీబీఐ అంటోంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవిత కీలక సూత్రధారి అని, ఆమె పాత్ర చాలా కీలకంగా ఉందని చార్జ్ షీట్ లో పొందుపరించింది సీబీఐ.

Also Read : రైతులూ బీ కేర్ ఫుల్.. ఆ లింకులు క్లిక్ చేస్తే రుణమాఫీ గోవిందా..!

ట్రెండింగ్ వార్తలు