Nalgonda Constituency: పక్కా స్కెచ్‌తో నల్లగొండలో కారు పాగా.. ఈసారి సత్తా చాటేదెవరు?

వచ్చే ఎన్నికల్లో కూడా నల్లగొండలో తమదే గెలుపు అంటోంది బీఆర్ఎస్. నల్లగొండలో మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. తొలిసారి కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.

Nalgonda Assembly constituency: నల్లగొండ.. 2018లో తొలిసారి గులాబీ జెండా ఎగురవేసిన నియోజకవర్గమిది. రాష్ట్రంలో తెలంగాణవాదం బలంగా వీచిన సమయంలోనూ నల్లగొండలో మాత్రం కాంగ్రెస్ కంచుకోట చెక్కుచెదరలేదు. కానీ 2018లో మాత్రం పక్కా స్కెచ్‌తో నల్లగొండలో కారు పాగా వేసింది. అభ్యర్థి ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు గెలిపిస్తే దత్తత తీసుకుంటానని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించి నియోజకవర్గ ప్రజలను తమవైపు తిప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అంటోంది బీఆర్ఎస్. విపక్షాల్లో వర్గపోరు అధికార పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. నల్లగొండలో మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇటు తొలిసారి కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నీ నియోజకవర్గాలు ఒక ఎత్తైతే నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రం మరో ఎత్తు. 1985లో ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గాల్లో నల్లగొండ ఒకటి. నల్లగొండ నియోజకవర్గం మొదట కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. 1952లో ద్విసభ నియోజకవర్గంగా ఉన్న నల్లగొండ 1957 నుంచి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. నల్లగొండ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ 7 పర్యాయాలు విజయం సాధించగా.. తెలుగుదేశం మూడుసార్లు, PDFతో కలుపుకొని వామపక్షాలు నాలుగుసార్లు, స్వతంత్రులు ఒకసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మొదటి సారి నల్లగొండ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగిరింది. 2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి అప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై భారీ మెజార్టీతో సంచలన విజయం నమోదు చేశారు.

నల్లగొండ నియోజకవర్గం (Nalgonda Constituency)లో మొత్తం 2,24,458 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 1,10,222 కాగా మహిళా ఓటర్లు 1,14,211 మంది ఉన్నారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్‌తో పాటు మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాలున్నాయి. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడంతో పాటు అభివృద్ధి విషయంలో కొత్త పుంతలు తొక్కేలా చర్యలు తీసుకున్నారు. పేరుకు జిల్లా కేంద్రమైన ఆది నుంచి నల్లగొండ పెద్దగా అభివృద్ధి చెందలేదు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు తర్వాత సీఎం కెసిఆర్ నల్లగొండ పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ తర్వాత నల్లగొండ రూపు రేఖలు పూర్తిస్థాయిలో మారుతున్నాయనే అభిప్రాయం స్థానికులలో ఉంది. జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ మంజూరు కాగా అది నిర్మాణంలో ఉంది. ఐటీ టవర్స్, పట్టణ వ్యాప్తంగా సుందరీకరణ పనులు, రహదారుల విస్తరణ, పార్కుల అభివృద్ధి, జిల్లా కేంద్రవాసులకు దీర్ఘకాల సమస్యగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లియరెన్స్ వంటి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.

Kancharla Bhupal Reddy (Pic: FB)

అధికార పార్టీకి అసమ్మతి బెడద
నల్లగొండ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చొరవతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఓ వైపు పాజిటివ్‌గా ఉంటే.. మరోవైపు సొంత పార్టీలోని అసమ్మతి బెడద సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ద్వితీయస్థాయి నేతలు పలువురు ఎమ్మెల్యే కంచర్ల తీరుపట్ల గుర్రుగా ఉన్నారు. ఉద్యమ నేతలు సైతం అంటిముంటనట్లే వ్యవహరిస్తున్నారు. తాజాగా బోనగిరి దేవేందర్, పంకజ్ యాదవ్ వంటి ఉద్యమకారులకు పార్టీ పదవులు ఇచ్చి.. అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేసినా.. సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ (Chakilam Anil Kumar) పార్టీకి రాజీనామా చేయడం BRSలో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ పిల్లి రామరాజు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండడం BRS వర్గాలను కలవరపెడుతోంది.

Also Read: కారు స్పీడ్‌కు బ్రేకులు పడేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) దూకుడు స్వభావం, నోటి దురుసు తమకు ఇబ్బందిగా ఉందని ఆ పార్టీ క్యాడర్ చెబుతున్నారు. తమకంటే ఇతర పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని.. వారి పనులే అవుతున్నాయని పలువురు సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నిరాదరణకు గురవుతున్న ఉద్యమకారులు.. తమ అనుకూల నేతల వెంట చేరుతున్నారు. నల్లగొండ నుంచి టికెట్ ఆశిస్తున్న బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఉద్యమకారులను, సీనియర్ నేతలను కలుస్తూ వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని ఇటీవలే BRSకు రాజీనామా చేసిన చకిలం అనిల్ కుమార్ ప్రకటించారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి (gutha amith reddy) కూడా నల్లగొండ టికెట్ ఆశిస్తున్నారు. అందుకే వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సిట్టింగ్‌లకే దాదాపు సీటు ఖాయం అన్న సీఎం కేసీఆర్ ప్రకటనలతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వర్గం ధీమాగా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండగానే పలువురు నేతలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీపడుతుండడంతో BRS రాజకీయం రసవత్తరంగా మారింది.

Dubbaka Narsimha Reddy (Pic: FB)

అభ్యర్థుల వేటలో విపక్షాలు
నల్లగొండ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే విపక్షాల తీరు మరింత రంజుగా ఉంది. కనీసం అభ్యర్థి ఎవరని చెప్పే స్థాయిలో విపక్షాలు లేవు. ఇదే అధికార పార్టీకి బలంగా.. అస్త్రంగా మారింది. నియోజకవర్గం చాలాకాలంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత.. ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komati reddy venkat reddy) ఇక్కడి నుంచి సుమారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అపవాదును కోమటిరెడ్డి ఎదుర్కొంటున్నారు. భువనగిరి ఎంపీగా విజయం సాధించిన తర్వాత నల్లగొండకు చాలా అరుదుగా వెంకటరెడ్డి వస్తున్నారు.

Also Read: పటాన్‌చెరులో గెలిచే పఠాన్ ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా?

అయితే మునుగోడు ఉపఎన్నికల సమయంలో పార్టీ మారిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్ధతివ్వాలంటూ కాంగ్రెస్ క్యాడర్‌కు చేసిన కాల్ బయటకు రావడం.. ఆ తర్వాత పార్టీపై పలుమార్లు చేసిన వ్యాఖ్యలు.. ఇటీవల తాను నల్లగొండ నుంచే పోటీ చేస్తానని చెప్పినా.. ఏ పార్టీ అనేది ఎన్నికల సమయంలోనే చెబుతానన్న పరిణామాలతో నియోజకవర్గంలో కోమటిరెడ్డి ప్రతిష్ట మసకబారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ద్వితీయ స్థాయి నేతలుగా ఉన్న దుబ్బాక నర్సింహారెడ్డి(Dubbaka Narsimha Reddy) వంటి వారు TPCC చీఫ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాము కూడా టికెట్ రేసులో ఉన్నామని చాటుకుంటున్నారు దుబ్బాక నర్సింహారెడ్డి. ఏదేమైనా తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండను కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోవడం లేదనే అభిప్రాయం క్యాడర్‌లోకి బలంగా వెళ్ళింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని నడిపించే నేత ఎవరనేది తెలియక.. కాంగ్రెస్ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు.

Madagoni Srrinivas Goud (Pic: FB)

బీజేపీలో గందరగోళం
ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పరిస్థితి సైతం నియోజకవర్గంలో గందరగోళంగానే ఉంది. వివిధ సమస్యలపై పోరాటాలు చేస్తూ క్యాడర్‌ను కదలిస్తున్నా.. ఆ పార్టీలోనూ గ్రూపు తగాదాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో జరుగుతున్న ఘటనలపై వెంటనే పార్టీ క్యాడర్‌ను కదలిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ (Madagoni Srrinivas Goud) నియోజకవర్గవ్యాప్తంగా చేపట్టిన బైక్ యాత్రకు రాష్ట్ర పార్టీ నుంచి ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు హాజరు కాగా.. టికెట్‌ను ఆశిస్తున్న ప్రైవేట్ వైద్యుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి వివిధ కార్యక్రమాల పేరుతో బీజేపీ కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యలపైనా ఆందోళనలు నిర్వహిస్తూ రాష్ట్ర పార్టీకి దగ్గరయ్యారు వర్షిత్ రెడ్డి. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరవుతారనేది క్లారిటీ లేదనే చెప్పాలి. అభ్యర్థి విషయంలో బీజేపీ కూడా చివర వరకు సస్పెన్స్ కొనసాగించే అవకాశం ఉంది.

వామపక్షాల విశ్వప్రయత్నం
నల్లగొండ నియోజకవర్గంలో ఇతర పార్టీలు కూడా తమ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. ఆదిలో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్లగొండపై మరోసారి ఎర్రజెండా ఎగురవేసేందుకు వామపక్షాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రయోగాలు చేసిన సీపీఎం… భారీగా ఓటు బ్యాంక్‌ను నష్టపోయింది. ఈసారి కూడా ప్రయోగాలు చేస్తారా లేక వేరే పార్టీకి మద్ధతు ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. BSP నుంచి పలువురు న్యాయవాదులు పోటీ పడుతున్నారు.. YSRTP, ఆమ్ ఆద్మీ ప్రభావం పెద్దగా లేదు. టిడిపి క్యాడర్ అంత ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వెంట రావడంతో ఆ పార్టీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

Also Read: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉంది.. కత్తులు దూస్తున్న నేతలెవరు?

మొత్తానికి నల్లగొండ నియోజకవర్గం(Nalgonda Assembly constituency)లో అన్నీ పార్టీలకు అసమ్మతి, ఆశావాహుల బెడద తప్పడం లేదు. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు అసంతృప్తితో అధికార BRS ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవుతుండగా.. తమకేం తక్కువ అన్నట్లుగా విపక్షాల పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో పాటు విపక్షాల్లో నెలకొన్న గందరగోళం తమకు అనుకూలాంశమని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే అనే అంశం తప్ప అధికార, విపక్షాలలో వచ్చే అభ్యర్థి ఎవరనేది ఎన్నికల వరకు సస్పెన్స్‌గానే ఉండే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు