ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు.. ఆ ఇద్దరు అగ్రనేతలతో భేటీకి అవకాశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానంకూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు రావడంతో ..

MLC Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానంపై అలకబూనారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకుసైతం ఆయన సిద్ధమయ్యారు. అయితే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు జీవన్ రెడ్డితో భేటీఅయ్యి బుజ్జగించారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కుతుందని జీవన్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా వీరి మధ్య చర్చలు జరిగినప్పటికీ.. జీవన్ రెడ్డి వెనక్కు తగ్గినట్లు కనిపించలేదు.

Also Read : అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ..! అసలు విషయం చెప్పిన ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్

భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుతో మంగళవారం జరిగిన భేటీ తరువాత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, చేరికల విషయంలో మనస్థాపం చెందానని తెలిపారు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్లే హక్కు నాకు ఉందని అన్నారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్లనే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించలేదని, కార్యకర్తలతో చర్చించిన తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంపై క్లారిటీ ఇస్తానని చెప్పారు.

Also Read : 33 మందిలో చివరికి మిగిలేది ఎంతమంది? గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానంకూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు రావడంతో విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను జీవన్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో మంత్రి వర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపపథ్యంలో జీవన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంత్రి పదవి విషయంపై కేంద్ర పార్టీ అధిష్టానం ఏమైనా హామీ ఇస్తుందా.. లేదంటే .. పార్టీలో కీలక పదవిని జీవన్ రెడ్డికి ఆఫర్ చేస్తుందా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు