Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక పథకాల అమలు వారికి మాత్రమే.. కలెక్టర్లకు ఆదేశాలు
Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై వారికి మాత్రమే పథకాలు అందించాలని సూచించారు.
Telangana Govt
- ఫేషియల్ రికగ్నైజేషన్తోనే ఇకపై పథకాలు
- ప్రతి పథకానికీ దీన్ని వర్తింప చేయాలి
- కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
Telangana Govt : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పథకాల అమల్లో అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలను, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. అయితే, పథకాల అమలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించాలని, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఐదు దశల్లో అమలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, సంక్షేమ పథకాల నుంచి అనర్హులను తొలగించాలని ఆమేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అనర్హులకు పథకాలు చేరకుండా, ఒక్కరికే రెండుసార్లు లబ్ధి చేకూరకుండా ఇకపై ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి పథకానికీ ఫేస్ రికగ్నైజేషన్ వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ‘అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3లక్షల మంది అనర్హులను తొలగించగలిగామని కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పిచాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయడంలో భాగంగా వాటిని సమీపంలోని వైద్య కళాశాలలకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులను కచ్చితంగా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
