భీమిలిలో ఊహించని విషాదం.. కొడుకు మృతి, తట్టుకోలేక తండ్రి కూడా..

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకమే ఆ తండ్రి, కొడుకు పాలిట మృత్యుపాశంగా మారింది. వారిని ప్రాణాలను హఠాత్తుగా హరించింది.

Bheemili tragedy father and son died after being bitten by pet dog

Bheemili tragedy : మృత్యువు ఎప్పుడు ఎలా కాటేస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటి విషాద ఘటనే విశాఖపట్నం జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకమే ఆ తండ్రి, కొడుకు పాలిట మృత్యుపాశంగా మారింది. వారిని ప్రాణాలను హఠాత్తుగా హరించింది. ఊహించని విషాదంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

భీమిలి సమీపంలోని ఎగువపేట ప్రాంతానికి చెందిన అల్లిపిల్లి నర్సింగరావు(55) మంగళవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఆయన కుమారుడు భార్గవ్(23) రేబిస్ వ్యాధితో చనిపోయాడు. నెల రోజుల క్రితం అతడిని పెంపుడు కుక్క కరిచింది. ఇది జరిగిన రెండు రోజులకు కుక్క చనిపోవడంతో అప్రమత్తమైన భార్గవ్ యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నాడు. అయినప్పటికీ అతడి ప్రాణాలు దక్కలేదు.

చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో నర్సింగరావు బాగా కుంగిపోయారు. అప్పటికే పక్షవాతంతో బాధపడుతూ భార్య సహాయంతో భిమిలీ బస్టాండ్‌లో సూప‌ర్‌వైజ‌ర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల వ్యవధిలో తండ్రి, కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంతో తీవ్ర విషాదం అలముకుంది. పెంపుడు కుక్క కారణంగానే భార్గవ్, అతడి తండ్రి చనిపోయాడని స్థానికులు అంటున్నారు.

Also Read : బెంగళూరు జైల్లో దర్శన్‌.. బరువు తగ్గిన హీరో, పవిత్ర గౌడ ఏడుపు