Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు

రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వొద్దని..మూడు గంటలు ఇస్తే చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అనవసరంగా 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసంలేదంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు సొంతపార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు.

Revanth Reddy Free electricity Comments

Revanth Reddy Free electricity Controversy : రైతులకు ఉచిత కరెంట్ విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వొద్దని.. మూడు గంటలు ఇస్తే చాలు అంటూ అమెరికా పర్యటలో ఉన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అనవసరంగా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసరం లేదంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యల్ని సొంతపార్టీ నేతలు సైతం తప్పుబడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు సొంతపార్టీ నేతలు అయోమయంలో పడితే, బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అసలు బుద్ధి బయటపడిందని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైఖరి ఏంటో అర్థం చేసుకోవాలంటున్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు : కాంగ్రెస్ నేతలు
రేవంత్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటంలేదు. దీనిపై సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలు సరికావన్నారు. ఆయన అలా ఎందుకన్నాడో అడుగుతామన్నారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధించాయని.. కానీ ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు అన్నారు. కానీ రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. అసలు దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అటువంటిది మరి రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు.

ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర : మంత్రి కేటీఆర్
ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, ఉచిత విద్యుత్ కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ రైతాంగానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు. 24 గంటల ఉచిత కరెంట్ రద్దు చేసి 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు  పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిది.. రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణం అంటూ విమర్శించారు. కాంగ్రెస్ కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు.. అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటి మర్చిపోదన్నారు.

కాంగ్రెస్ కాలంలో కరువులు.. కన్నీళ్లు.. కటిక చీకట్లు.. అప్పులు.. ఆత్మహత్యలతో  అన్నదాతలు అరిగోస పడ్డారని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్ ను ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కేంద్రం కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదని అన్నారు.  24 గంటల ఉచిత కరెంట్ ను కాపాడుకోవడం కోసం ఏకంగా 30వేల కోట్ల రూపాయలను వదులుకున్నది తప్ప రైతుల ప్రయోజనాలపై రాజీపడలేదన్నారు. ఈ 24 గంటల ఉచిత విద్యుత్ వెలుగుల్ని వదులుకుందామా? కటిక కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా?  చైతన్యవంతమైన తెలంగాణ  రైతులు ఆలోచించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ మారినా రేవంత్ మనస్సు మారలేదు
రైతుల గురించి కాంగ్రెస్ పార్టీకి పట్టదని.. ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన పనిలేదు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు. పార్టీ మారినా రేవంత్ రెడ్డి మనస్సు మాత్రం మారలేదు అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమాలను అభివృద్ధి ఫలాలను చూసి ఓర్వలేకపోతున్నారని, వాటిని తాము అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

ప్రజలను కష్టాల్లోకి నెట్టటమే
రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేవలం మూడు గంటలు ఎలా సరిపోతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvwada Ajay Kumar) అని ప్రశ్నించారు. ప్రజలను కష్టాల్లోకి నెట్టటమే కాంగ్రెస్ ఉద్ధేశ్యమని.. అది రేవంత్ రెడ్డి మాటల్లో తెలుస్తోందన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

రైతుల్ని దగా చేసేలా రేవంత్ వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతుల్ని దగా చేసేలా ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్‌, పంట పెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్‌ (Congress) నేతలు శత్రువులని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు