ధరణిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

అఖిలపక్ష సమావేశం నిర్వహించి ధరణి పోర్టల్ పై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.

Dharani Portal : ధరణిపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్వరలో ధరణిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతోంది. ధరణిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని భావిస్తోంది ప్రభుత్వం. సచివాలయంలో ధరణిపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ధరణిలో సమస్యలు, మార్పులు చేర్పులు, ఇతర అంశాలపై చర్చించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు సీఎం.

సవరణలపై కొత్త సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, అఖిలపక్ష సమావేశం నిర్వహించి ధరణి పోర్టల్ పై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ ధరణిపై చర్చ పెడదామని సీఎం రేవంత్ అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది. అయితే ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికీ ఆ సమస్యలు అలానే ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. వీటన్నింటిపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. తాము అధికారంలోకి వచ్చాక ధరణిలో మార్పులు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న రేవంత్ సర్కార్, కొత్త ఆర్ఓఆర్(రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం తీసుకొచ్చే దిశగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే ధరణిపై ఇప్పటికే ఒక కమిటీ వేసి అధ్యయనం జరుపుతోంది. మాడ్యూల్స్ మార్చడం అనేది ప్రధాన సమస్యగా మారిందని కమిటీ తెలిపింది. వీటన్నింటికి పరిష్కారం కనుగొనే దిశగా మరింత లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల అభిప్రాయాల మేరకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఉండాలనేది ప్రభుత్వం భావన. ఇందులో భాగంగానే ధరణిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.

Also Read : ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ట్రెండింగ్ వార్తలు