Revanth Reddy: ప్రజలు ఇక సంబరాలు జరుపుకోవాలి.. దసరాను ఘనంగా..: రేవంత్ రెడ్డి కామెంట్స్

కేసీఆర్ ఫాంహౌస్ వదిలి రావాల్సిన అవసరం లేదని, ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.

Revanth Reddy

Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణకు పట్టిన పీడా నుంచి ప్రజలకు విముక్తి కలగనుందని చెప్పారు.

తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవాలని, దసరాను ఘనంగా నిర్వహించుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. కేసీఆర్ ముక్త రాష్ట్రం కోసం ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలో వచ్చాక ఆరు గ్యారెంటీల మీదే తొలి సంతకం పెడతామని అన్నారు.

కొన్ని గుంట నక్కలున్నాయని, ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన మరుసటి రోజు నుంచే సీఎం కేసీఆర్ కనిపించడం లేదని అన్నారు. ఆ హామీలను చూసే కేసీఆర్ కు చలిజ్వరం వచ్చిందని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి రావాల్సిన అవసరం లేదని, ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.

డిసెంబరులో మరో అధ్బుతం జరగబోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే అద్భుతమని అన్నారు. తమ పార్టీ ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రల్లో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని తెలిపారు.

బీజేపీకి అభ్యర్థులు లేరని, మేనిఫెస్టో లేదని చెప్పారు. ఇటీవల తెలంగాణ పర్యటనతో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పింది అబద్ధమైతే దాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. 2018 ఎన్నికల్లో బీజేపీ ఓటు టీఆర్ఎస్ కు బదిలీ అయిందని ఆరోపించారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం అందినకాడికి దోచుకుందని ఆరోపించారు.

Assembly Elections 2023: 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలపై దేశంలోని కీలక నేతలు ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు