విజయనగర వారసత్వ పోరు.. అప్పుడేం చేశారంటూ అశోక్ గజపతిరాజుకు సంచైత కౌంటర్

  • Publish Date - June 3, 2020 / 11:46 AM IST

విజయనగరం పూసపాటి రాచ కుటుంబంలో కొనసాగుతున్న వ్యవహారం.. యావత్ తెలుగు ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మాన్సస్‌ ట్రస్ట్‌, మూడు లాంతర్ల వ్యవహారంతో బాబాయ్‌, అమ్మాయ్‌కి మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. అసలు విజయనగరం మహారాజుల వారసత్వం ఎవరిది..? మాన్సస్‌ ట్రస్ట్ ఎందుకు చేతులు మారాల్సి వచ్చింది..? 

వారసత్వ పోరా..? లేక రాజకీయమా..?  
విజయనగరం పూసపాటి వంశీయులకు చెందిన మాన్సస్ ట్రస్ట్‌, అలాగే సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంలో జరిగిన పరిణామాలు మరువక ముందే తాజాగా విజయనగరంలో చోటు చేసుకున్న మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత మరో వివాదానికి దారితీసింది. అతి పురాతనమైన ఈ కట్టడాన్ని కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు రాజవంశీయులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు కుటుంబం .. తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం.. ప్రభుత్వ నేతల తీరుపై అశోక్‌ గజపతిరాజు ధ్వజమెత్తారు. అశోక్‌ గజపతిరాజు అన్న కుమార్తె సంచైత కూడా ట్విట్టర్‌ వేదికగా బాబాయ్‌పై విమర్శలు గుప్పించారు. 

బాబాయ్‌ అమ్మాయ్‌ మధ్య ముదురుతున్న వివాదం
1969లో నిర్మించిన మోతీమహల్‌ను ఎందుకు కూల్చివేశారని.. దాన్ని కూల్చకుండా బాగుచేయించొచ్చు కదా అని ప్రశ్నించారు.. సంచైత. ఆమె తాత, తండ్రులు బతికి ఉండగానే వీటిని కూల్చివేశారని.. అప్పుడు ఎందుకు సంచైత ఈ ప్రశ్న అడగలేదంటూ అశోక్‌ గజపతి లేవనెత్తిన ప్రశ్న .. ఇప్పుడు చర్చనీయాంశమైంది. సంచైత ప్రస్తావించిన మోతీ మహల్ పూర్తిగా శిథిలమైందని దానిని పాఠశాలగా ఉపయోగిస్తున్నందువల్ల .. అది అకస్మాత్తుగా కూలిపోతే.. ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని అశోక్‌ చెప్పారు. దాన్ని కూల్చి.. ఆ భవనం స్థానంలో మరో భవనాన్ని నిర్మించేందుకు .. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టామని చెప్పారు. 

విజయనగర సంస్థానంలో వారసత్వ పోరు
అశోక్‌ గజపతిరాజు కుటుంబాన్ని, వారసత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికే సంచైతను రాజకీయంగా రంగంలోకి దించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. సంచైత కూడా తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు. పూసపాటి వంశీల వారసత్వ సంపద కేవలం ఒక్క వ్యక్తిచేతిలో ఉండదని .. అది తరతరాల నుంచి వస్తోందని చెబుతోంది. తాము కేవలం వారసత్వ సంపదకు సంరక్షకులం మాత్రమే అంటోంది. దీంతో బాబాయ్‌ అమ్మాయ్‌ మధ్య వాగ్వాదం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా సంచైతా గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె ఎవరో ప్రజలకు తెలియదు. ఏపీ సర్కారు తీసుకువచ్చిన ఓ రెండు జీవోలు సంచైత లైఫ్‌నే మార్చేశాయి. రాత్రికి రాత్రే ఆమె మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టటమే కాకుండా.. హఠాత్తుగా తెరపైకి వచ్చి పూసపాటి వంశీయుల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 

మార్చి 4న మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచైత బాధ్యతలు 
ఈ ఏడాది మార్చి 4న మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజు బాధ్యతలు తీసుకున్నారు. ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతి. వీరికి ఇద్దరు సంతానం. వారిలో చిన్న కుమార్తె సంచైత గజపతిరాజు. ఆనంద గజపతిరాజు.. ఉమా గజపతి వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం బాలీవుడ్‌ డైరెక్టర్‌ రమేష్‌ శర్మను ఉమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయనగరం వైపు వచ్చిందే లేదు. ఇప్పటి జనరేషన్‌కు వీరి గురించి అసలు తెలియనే తెలియదు. సనా అనే స్వచ్ఛంద సంస్ధ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సంచైత. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆమె మాన్సాస్‌ ట్రస్ట్‌కు, సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం.. ఊహాతీతంగా మారింది. 

ఆనంద్‌ గజపతిరాజుతో ఉమా గజపతి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు కూడా రాజకుటుంబంతో కలవలేదు. తండ్రి ఆనందగజపతి రాజు ఉన్నంత కాలం ఇటు వచ్చిందే లేదు. అయితే ఆయన చనిపోయినప్పుడు మాత్రం విజయనగరం వచ్చారని .. వారికి తనకు తెలిసిన ఓ మిత్రుడి ఇంట్లో బస ఏర్పాటు చేశానని చెబుతున్నారు.. అశోక్‌ గజపతి రాజు. బతికి ఉండగా తన అన్న ఆనందగజపతిరాజును మానసికంగా వేధించిన ఆ కుటుంబం .. ఇప్పుడు ఇలా వచ్చి చిచ్చు పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆశోక్‌ గజపతి రాజు.

ఎవరికీ అంతుపట్టని రాచ కుటుంబ వ్యవహారం 
ఆనంద్‌ గజపతిరాజు, ఉమా గజపతి చట్టపరంగా విడాకులు తీసుకున్నా.. వారిద్దరి సంతానమైన సంచైతకు పూసపాటి వారత్వం ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే న్యాయ విద్య చదివిన సంచైత.. చట్టపరంగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే .. తండ్రి వారసురాలిగా పూసపాటి వంశంలోకి వచ్చారన్న చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అశోక్‌ గజపతిరాజును ఎదిరించలేక అదును కోసం ఇంతవరకూ వేచి చూసి.. ఇప్పుడు వైసీపీ సర్కారు అండతో … రాజకుటుంబంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంపై అశోక్‌ గజపతిరాజు కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న దానిపై.. విజయనగరం కోటలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
 

ట్రెండింగ్ వార్తలు