Alluri Sitaramaraju : బ్రిటీష్ సైన్యాన్ని వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు .. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇవే..

స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్ల దొరలకు సింహస్వప్నంగా నిలిచిన పోరాట యోధుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు.

Alluri Sitaramaraju Vardhanti : స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్ల దొరలకు సింహస్వప్నంగా నిలిచిన పోరాట యోధుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఓ అధ్యాయం. స్వాతంత్ర్యం పొందటానికి సాయుధ పోరాటం ఒక్కటే అని నమ్మిన అల్లూరి.. తన పోరాట పటిమతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. కొన్నేళ్లపాటు సమరశీల ఉద్యమాలకు అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించారు. తనను నమ్ముకున్న ప్రజల కోసం సాగించిన పోరాటంలో 1924మే 7న అల్లూరి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది.. బ్రిటీష్ వారికి ఎదుర్కొడ్డి పోరాటంచేసి వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జీవితం స్ఫూర్తి దాయకం. విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జూలై 4న అల్లూరి జన్మించారు. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. వారిది దిగువ మధ్య తరగతి కుటుంబం. గోదావరిజిల్లాల పరిధిలోని నరసాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, తుని, కికానాడ సహా పలు చోట్ల ఆయన విద్యాభ్యాసం సాగింది. అయితే, అల్లూరి సీతారామరాజు ఆరో తరగతి చదువుతున్న సమయంలో కలరా వ్యాధితో ఆయన తండ్రి 1908లో మరణించారు. తండ్రి మరణం తరువాత అల్లూరి విద్యాభ్యాసం ముందుకు సాగలేదు. ఆ తరువాత ధ్యానంలోకి వెళ్లిపోవాలనే లక్ష్యంతో 1916లో అల్లూరి ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించారు. తీర్థ యాత్రలు చేసి 1918లో తిరిగి సొంతగడ్డకు అల్లూరి చేరుకున్నారు.

1919 నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయన్ని పై పోరాటం మొదలు పెట్టిన అల్లూరి.. ఇరవై ఏళ్ల వయస్సు నిండకుండానే అడవి బాటపట్టాడు. స్థానికులతో కలిసి గిరిజనులపై సాగుతున్న బ్రిటీష్ అధికారుల దౌర్జన్యాలపై అల్లూరి తిరుగుబాటు చేశారు. కొద్దికాలంలోనే అల్లూరికి ప్రజల్లో ఆదరణ పెరిగి ఉద్యమ తీవ్రరూపం దాల్చింది. పోరాటం ఉధృతంగా సాగుతున్న క్రమంలో మంప కొలనులో స్నానం చేస్తుండగా 1924 మే7న బ్రిటీష్ సైన్యానికి అల్లూరి పట్టుబడ్డారు. మేజర్ గుడాల్ అనే అధికారి అల్లూరిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్లు చరిత్రకారులు చెబుతారు. అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవిపేటకు తరలించి అక్కడే దహన సంస్కారాలు చేశారు. అల్లూరి పట్టుబడిన చోట స్మారక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అల్లూరి విగ్రహాలు ప్రతిష్టించారు.

1986లో అల్లూరి సీతారామ రాజు స్మారక స్టాంపును ఇండియా పోస్ట్ విడుదల చేసింది. 2022లో సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహంను ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి జిల్లాను ఏర్పాటు చేసింది.. ఆ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు