ఆపద మొక్కులు : శ్రీ వారి ఆస్తుల వివరాలు..TTD శ్వేతపత్రం కసరత్తు

  • Publish Date - June 1, 2020 / 01:47 AM IST

శ్రీ వారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు TTD రెడీ అవుతోంది. చైర్మన్‌ ఆదేశాలతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయన్న దానిపై లెక్కలు తీస్తున్నారు. ఈ లెక్కలు కొలిక్కి వస్తే శ్రీవారి ఆస్తులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల కానుంది. మరి స్వామి వారి ఆస్తులెన్ని.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ?

దేశంలోనేకాదు… ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న టీటీడీ భూములను శ్వేతపత్రంలో చేర్చనుంది. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయనుండడంతో… అసలు శ్రీవారికి ఎన్ని ఆస్తులున్నాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇందులో భూములెన్ని, చర, స్థిరాస్తులెన్ని, బంగారు, వెండితో పాటు నగదు ఎంతన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి 930 ప్రాంతాల్లో ఆస్తులున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో పాటు… విదేశాల్లోనూ ఆయనకు ఆస్తులున్నాయి.

పొరుగు దేశమైన నేపాల్‌లోనూ వెంకటేశ్వరస్వామికి ఆస్తులు ఉన్నాయి. మన దేశంలోని పది రాష్ట్రాల్లో శ్రీనివాసుడికి భూముల రూపంలో  దాదాపు 6వేల 500 ఎకరాలు ఆస్తులున్నాయి. చిత్తూరు జిల్లాలో 5 వేల ఎకరాలు, కడపలో 267 ఎకరాలు, విశాఖలో 190 ఎకరాల భూమి ఉంది. శ్రీవారి పేరుమీద నెల్లూరు జిల్లాలోనూ 108 ఎకరాల భూమి ఉంది. ఇక తెలంగాణలో స్వామి వారి పేరు మీద 144 ఎకరాల భూమి ఉంది. 

పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ వెంకన్నకు ఆస్తులు ఉన్నాయి. తమిళనాడులోని 41 ప్రాంతాల్లో ఈ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. కర్నాటకలో 10 ప్రాంతాల్లో ఆస్తులున్నాయి. ఏడుకొండల వాడికి ఇక రిషికేశ్‌లో 10 ఎకరాల మామిడితోట ఉంది. ఇక ఒడిశాలోనూ స్వామి వారికి ఆస్తులున్నాయి. గతంలో వివిధ దశల్లో విక్రయించినవి, దురాక్రమణకు గురైన భూముల వివరాలు శ్వేతపత్రంలో ఉండేలా చూడనున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆస్తులు, భూములు, ఆక్రమణకు గురై స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను సైతం శ్వేతపత్రంలో పొందు పర్చనున్నారు. 

Read: గంటకు 300మందికే అనుమతి, ఆధార్ మస్ట్, అన్నదానం ఉండదు.. ఆలయాల్లో దర్శనానికి కొత్త మార్గదర్శకాలు

ట్రెండింగ్ వార్తలు