ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్‌గా ప్రైవేట్‌రంగ దిగ్గజం మల్లికా శ్రీనివాసన్.. చరిత్రలో తొలిసారి

Mallika Srinivasan: ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ (టీఏఎఫ్‌ఈ) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లికా శ్రీనివాసన్‌ను ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డు(PESB) ఛైర్‌పర్సన్‌గా నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సిబ్బంది(పర్సనల్‌) మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రైవేటు రంగంలోని నిపుణురాలిని PESB ఛైర్‌పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో టాప్ మేనేజ్మెంట్ పోస్టుల నియామకానికి బాధ్యత వహించే చైర్పర్సన్ పదవికి ప్రైవేట్ రంగ నిపుణులను తొలిసారి నియమించారు. గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఈ పదవుల్లో పెట్టేవారు.. ఆ సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం మంగళం పాడుతూ.. ఓ ప్రైవేట్ సంస్థకు చైర్ పర్సన్‌గా పనిచేసిన మహిళను PESBకి నియమించారు.

ఈ పదవిని అలంకరించిన వారు.. 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా మూడు సంవత్సరాల కాలపరిమితి ముగిసే వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం మల్లికా శ్రీనివాసన్ వయసు 61 సంవత్సరాలు, ఆమెకు 64 ఏళ్ళు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డులో ఓ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు.

చైర్‌పర్సన్‌గా మల్లికా శ్రీనివాసన్ నియామకం అవగా సభ్యులుగా 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మిస్టర్ శైలేష్, ఎంకె గుప్తా, రియర్ అడ్మిరల్ శేఖర్ మిటల్ (రిటైర్డ్) సభ్యులుగా ఉన్నారు. వీరు కూడా మూడేళ్లు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.. ఈ రెండింట్లో ఏది ముందు వస్తే దాని ప్రకారం వైదొలుగుతారు. కేబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) మల్లికా శ్రీనివాసన్‌ నియామకాన్ని ఆమోదించింది.

ట్రెండింగ్ వార్తలు