HBD Mahesh Babu
HBD Mahesh Babu: అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా కనపడే ఈ ఒక్కడు.. సినిమాల్లో మాత్రం దూకుడు తగ్గకుండా దూసుకెళ్తున్నాడు. ఈ నాని వయసు 47 అయినా అభిమానుల మనసుల్లో ఇప్పటికీ, ఎప్పటికీ 25 ఏళ్ల రాజ కుమారుడే. శ్రీమంతుడు అయినప్పటికీ సమాజానికి సైనికుడిలా సేవలు అందిస్తున్నాడు… సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నాడు. అందుకే అందరూ ఆయనను సూపర్ స్టార్ అంటున్నారు.
చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాడు. హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుని కమర్షియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహేశ్ బాబు హీరోగా నటించిన హిట్ సినిమాల గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం…
HBD Mahesh Babu
రాజకుమారుడు: మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ తొలి చిత్రం 1999 లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీశారు. మహేశ్ సరసన ఈ సినిమాలో ప్రీతి జింటా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా హిందీలోనూ రీమేక్ అయింది.
మురారి
మురారి: కృష్ణవంశీ దర్శకత్వంలో అల్లరి చేస్తూ, నవ్వులు పుట్టిస్తూ మహేశ్ బాబు ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాని రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వరరావు, ఎన్. దేవిప్రసాద్ నిర్మించారు. మహేశ్ బాబు సరసన సోనాలి బింద్రే నటించింది. ఈ సినిమాకి కూడా మణిశర్మ సంగీతం అందించారు.
ఒక్కడు: మహేశ్ బాబుకి విపరీతంగా ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన సినిమా ఒక్కడు. ఈ సినిమా 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైంది. అప్పట్లో అనేక థియేటర్లలో ఏకంగా 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. మహేశ్ బాబు సరసన ఈ సినిమాలో భూమిక నటించగా ప్రకాశ్ రాజ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ రీమేక్ అయింది.
అతడు: మురారీ, ఒక్కడు, రాజకుమారుడు వంటి సినిమాల్లో అల్లరి చేస్తూ కనపడిన మహేశ్ బాబు ఈ సినిమాలో మాత్రం సీరియస్‌గా కనపడతాడు. ఈ సినిమా 2005లో విడులైంది. మహేశ్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.
పోకిరి: అతడు వంటి సూపర్ హిట్ సినిమా తరువాత మహేశ్ బాబు వెను వెంటనే పోకిరి సినిమాతో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2006లో విడుదలైన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాతో మహేశ్ బాబు మాస్ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. పోకిరిలో మహేశ్ సరసన ఇలియానా నటించింది.
Dookudu
దూకుడు: పోకిరి తరువాత హిట్లు లేక సతమతమవుతోన్న మహేశ్ బాబుకి దర్శకుడు శ్రీను వైట్ల 2011లో దూకుడు సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన సమంత నటించింది.
బిజినెస్ మేన్: ఈ హైఓల్టేజ్ యాక్షన్ మూవీలో సూర్య పాత్రలో నటించాడు మహేశ్. ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మహేశ్ బాబు కెరీర్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను మరింత అలరించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకటేశ్ తో కలిసి నటించి లేడీస్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నాడు మహేశ్.
Srimanthudu
శ్రీమంతుడు: ఈ సినిమా కూడా మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 2015 ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా సామాజిక బాధ్యత ప్రధానాంశంగా వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రుతి హాసన్ నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.
సినీ చరిత్రలో.. మహేశ్ బాబు భారీ హిట్ సినిమాలు ఇవే..
భరత్ అనే నేను: ఈ సినిమా మహేశ్‌కు మరో భారీ విజయాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో మహేశ్ బాబు నటించారు. ఏప్రిల్ 20న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా సొసైటీ అంటే అందరికీ భయం, బాధ్యత ఉండాలంటూ సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
మహర్షి: ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ అనే నేను తర్వాత వచ్చిన వరుసగా రెండో హిట్ మహేశ్ బాబు ఖాతాలో పడింది. ఈ సినిమాలో రిషిగా ఆకట్టుకున్న మహేశ్ బాబుతో కలిసి అల్లరి నరేశ్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు.
Sarileru Neekevvaru
సరిలేరు నీకెవ్వరు: ఈ సినిమా 2020లో విడుదలైంది. అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ బాబు నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించాడు. దేశ సరిహద్దుల్లో సైనికుడు అంతగా కష్టపడుతోంటే, సొంత దేశాన్ని కొందరు ఎలా నాశనం చేస్తున్నారో చెప్పాడు. ఒక్కడు సినిమా తర్వాత కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఓ సీన్ లో కనపడి మహేశ్ అలరించాడు.